పావురాల కాళ్లకు లైట్లు కట్టి రాత్రి పూట గాళ్లోకి ఎగురవేసి డ్రోన్లుగా చిత్రీకరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రంలోని ముజప్ఫర్‌నగర్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజప్ఫర్‌నగర్‌లో ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా రాత్రిపూట గుర్తుతెలియని డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి స్థానిక గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తి్ంచాయి. దీంతో అప్రమత్తమైన కొందరు గ్రామస్థులు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు షోయబ్, సాకీబ్ అనే ఇద్దరు యువకులపై అనుమానం రావడంతో వాళ్లని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తామే పావురాల కాళ్లకు లైట్లు కట్టి రాత్రిపూట సమీప గ్రామాళ్లోకి వదులుతున్నట్లు ఇద్దరు యువకులు పోలీసులకు తెలిపారు. ఆ పావురాలనే ప్రజలు దూరం నుంచి చూసి వాటిని డ్రోన్లుగా భావించి భయాందోళనకు గురైనట్టు చెప్పారు.
దీంతో ఇద్దరు యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి నుంచి రెండు పావురాలు, ఒక పంజరం, రెడ్, గ్రీన్‌కలర్ ఎల్‌ఈడీ లైట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ మరోసారి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.