Pakistan: లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న 2028 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ తిరిగి రాబోతోంది. అయితే, ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్ల ఎంపికపై అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న కీలక నిర్ణయం పాకిస్తాన్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లకు పెద్ద షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ అర్హత మార్గాన్ని ఎంచుకోవడంతో కొన్ని బలమైన జట్లు ఒలింపిక్స్ ఆడే అవకాశం కోల్పోనున్నాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ చేరడం క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్. అయితే, ఈ మెగా టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల క్రికెట్ జట్ల ఎంపిక విధానంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్ వంటి మరో అగ్రశ్రేణి జట్టు కూడా ఒలింపిక్స్ బెర్త్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కోసం అర్హత మార్గాన్ని ఖరారు చేసినట్లు ది గార్డియన్ నివేదిక వెల్లడించింది. మొత్తం ఆరు పురుషుల, ఆరు మహిళల జట్లు ఒలింపిక్స్‌లో పోటీపడతాయి. అయితే, ఐసీసీ ప్రాంతీయ అర్హత ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం, ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలలో టాప్ ర్యాంక్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఆతిథ్య దేశం అమెరికాకు కూడా నేరుగా బెర్త్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. ఆసియాలో భారత్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఓషియానియాలో ఆస్ట్రేలియా నంబర్ 1 స్థానంలో ఉంది. ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా నంబర్ 1 స్థానంలో ఉంది. యూరప్‌లో ఇంగ్లాండ్ నంబర్ 1 స్థానంలో ఉంది.
ఆతిథ్య దేశం అమెరికాకు అవకాశం ఇస్తే అది వెస్టిండీస్ మాదిరిగానే ఒక కంబైన్డ్ టీమ్‌గా పరిగణించబడే అవకాశం ఉంది. ఆరో జట్టును ఎలా ఎంపిక చేస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. ఒలింపిక్స్ ఒక ప్రపంచ ఈవెంట్ కావడంతో, అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి ప్రతి ప్రాంతం నుండి ఒక జట్టును ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, పాకిస్తాన్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. ఆసియా నుండి భారత్ అగ్రస్థానంలో ఉన్నందున, ప్రాంతీయ అర్హత ప్రకారం పాకిస్తాన్‌కు ఒలింపిక్స్ అవకాశం దక్కదు. అదేవిధంగా, న్యూజిలాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, ఓషియానియా ప్రాంతంలో ఆస్ట్రేలియా (టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం) ముందుండటంతో న్యూజిలాండ్‌కు కూడా నిరాశ తప్పదు. ఐసీసీ నిర్ణయం పట్ల పాకిస్తాన్, న్యూజిలాండ్ బోర్డులు తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనకు ఐసీసీ బోర్డు ఇంకా అధికారికంగా ఆమోదం తెలపలేదు, కానీ ఈ నిర్ణయం మారే అవకాశం తక్కువగా ఉందని సమాచారం.
మరోవైపు, ఆతిథ్య దేశమైన అమెరికా జట్టుకు కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. యూఎస్ ఒలింపిక్ & పారాలింపిక్ కమిటీ నుంచి ‘నేషనల్ గవర్నింగ్ బాడీ’ గుర్తింపు పొందడంలో అమెరికా జట్టు విఫలమైతే, వారి అర్హతకు కూడా అడ్డంకి ఏర్పడే అవకాశం ఉంది. ఒలింపిక్ చార్టర్ ప్రకారం, ఈ గుర్తింపు తప్పనిసరి. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి అమెరికా జట్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల టోర్నమెంట్‌కు అర్హత వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ ఫలితాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. 128 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ స్థానం దక్కించుకుంది. పురుషుల, మహిళల జట్లు టీ20 ఫార్మాట్‌లో పోటీపడతాయి. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా, చివరిసారిగా క్రికెట్ నిర్వహించారు. అప్పుడు డెవాన్ అండ్ సోమర్‌సెట్ వాండరర్స్ క్లబ్ (బ్రిటన్), ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ (ఫ్రాన్స్) మధ్య రెండు రోజుల మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్రిటన్ విజయం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..