
చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్, వాణిజ్య శాఖ మంత్రి టాన్ సీ లెంగ్, హోం మంత్రి కె. షణ్ముగంలతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. గత పాలకుల పనితీరు వల్ల దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పటిష్టం చేయాలనే ఉద్దేశంతో సీఎం ఈ చొరవ తీసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో మళ్లీ భాగస్వామ్యం కావాలని కోరారు. సింగపూర్ ప్రతినిధులకు గతంలోని లోపాలను వివరించి, కొత్తగా తమ ప్రభుత్వ ఆలోచన, అందుకు చట్టబద్దమైన కార్యాచరణతో ముందుకెళ్లే సంకల్పాన్ని తెలియజేశారు. నవంబరులో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. వారి స్పందన సానుకూలంగా ఉందని ఖచ్చితంగా బలహీనపడ్డ బంధాలు బలోపేతం అయ్యాయని భావిస్తున్నట్టు అధికారులు వివరిస్తున్నారు.
పరిశ్రమల దృష్టిని ఆకర్షించిన సీఎం బృందం
అదే సమయంలో పెట్టుబడులు వెంటనే రావని, మనం ఇచ్చిన ప్రణాళికలపై అంచనాలు వేసుకుని భవిష్యత్తులో రాష్ట్రం వైపు ఆసక్తి చూపుతారని, అందుకోసం తాము నిరంతరం వారితో టచ్‌లో ఉంటామని సీఎమ్ఓ వివరిస్తుంది. సుర్బానా జురాంగ్, సెంబ్ కార్ప్, కేపెల్ కార్పొరేషన్, టీవీఎస్ మోటార్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (GIC), ఎస్ఐఏ ఇంజినీరింగ్, క్యాపిటాల్యాండ్, ఎవర్సెండై, టామ్ సెక్, మండై వైల్డ్ లైఫ్, అదానీ పోర్ట్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఏపీ పరిస్థితులు, విధానాలను సీఎం బృందం వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఫిన్‌టెక్, మారిటైమ్, పట్టణాభివృద్ధి, హౌసింగ్, పోర్టుల అభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని వివరించారు. ఈ సమావేశాల ద్వారా రాష్ట్రానికి నూతన పెట్టుబడి అవకాశాల ద్వారాలు తెరుచుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అత్యాధునిక మోడల్స్‌పై అధ్యయనం.. రాష్ట్రానికి అమలు ప్రణాళిక
పర్యటనలో భాగంగా బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్, జురాంగ్ ఐలాండ్, టువాస్ పోర్టు, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ వంటి ప్రాజెక్టులను సీఎం బృందం పరిశీలించింది. ఇక్కడి మోడల్స్‌ను రాష్ట్రానికి ఎలా అనుసంధానించాలి? ఏ రంగాల్లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాలి? అనే దిశగా ప్రణాళికలు రూపొందించాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ స్కూల్ స్థాయిలో కోచింగ్, ఫసిలిటీలపై సీఎం ఆసక్తి చూపారు.
తెలుగు ప్రజల ఆదరణ.. సీఎం బృందానికి ఘన స్వాగతం, వీడ్కోలు
సింగపూర్ పర్యటన తొలి రోజునే సౌత్ ఈస్ట్ ఆసియాలోని ఐదు దేశాల తెలుగు డయాస్పోరా ప్రతినిధులు ముఖ్యమంత్రి బృందానికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. చివరి రోజున వీడ్కోలు కార్యక్రమంలోనూ తెలుగు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సింగపూర్ భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే టూర్ అంతా సీఎం బృందానికి సహకరించారు. మొత్తంగా ఈ పర్యటన దౌత్యంగా, పెట్టుబడుల పరంగా, బంధాలను పునరుద్ధరించే ప్రయత్నంగా మైలురాయిగా నిలిచినట్లు అధికారులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.