Mohammed Siraj : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఉత్కంఠగా మారింది. సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుండగా, ఇంగ్లాండ్ సిరీస్‌ను గెలుచుకోవాలని చూస్తోంది. ఈ కీలక మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేస్తాడని దక్షిణాఫ్రికా దిగ్గజం డెల్ స్టెయిన్ జోస్యం చెప్పాడు. సిరాజ్ ఐదు వికెట్లు తీస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టుకు ఐదవ టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా, ఇంగ్లాండ్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఈ కీలక పోరు నేడు జూలై 31 నుండి లండన్‌లోని ది ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డెల్ స్టెయిన్ ఒక అంచనా వేశారు. భారత పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఆడిన 4 టెస్టుల్లో 7 ఇన్నింగ్స్‌లలో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీశాడు. ఈ పర్యటనలో భారత్ గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే. ఆ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. ఐదవ టెస్ట్‌లో కూడా బుమ్రా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో సిరాజ్ మరోసారి భారత బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. డెల్ స్టెయిన్ తన ట్విట్టర్ ఖాతాలో మహ్మద్ సిరాజ్ గురించి అంచనా వేస్తూ.. సిరాజ్ 5వ టెస్ట్‌లో ఫిఫర్ తీస్తాడని రాశారు. ఇది క్రికెట్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించింది.
Siraj to take a fifer in 5th Test.
— Dale Steyn (@DaleSteyn62) July 30, 2025
సిరాజ్ ఇటీవల పర్ఫామెన్స్ పరిశీలిస్తే.. నాల్గవ టెస్ట్ లో 30 ఓవర్లలో 4.66 ఎకానమీతో 140 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. మూడవ టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 4 వికెట్లు (2+2) పడగొట్టాడు. రెండవ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ తీశాడు. మొదటి టెస్ట్ లో 2 వికెట్లు సాధించాడు.
జస్ప్రీత్ బుమ్రా ఓవల్‌లో ఆడకపోతే, యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చు. అయితే, ఈ పర్యటన ప్రారంభం నుంచీ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ, అతను నాలుగు మ్యాచ్‌లలో ఆడలేదు. చివరి టెస్ట్‌లో అతనికి తుది XI లో అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..