WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భాగంగా జూలై 31న అంటే నేడు ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన ఇండియా ఛాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ అధికారికంగా రద్దైంది. ఈ కీలక పోరులో యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు, దేశభక్తిని చాటుకుంటూ పాకిస్తాన్‌తో ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గతంలో ఈ మ్యాచ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు దారితీశాయి.
పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో వారికి ఇండియా ఛాంపియన్స్‌తో తలపడాల్సి ఉంది. అయితే, భారత ఆటగాళ్లు దేశాన్ని మ్యాచ్ కంటే ఉన్నతంగా భావించి, పాకిస్తాన్‌తో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో లీగ్ దశలో కూడా భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడలేదు. సెమీఫైనల్‌లో భారత జట్టు తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందని, తప్పకుండా ఆడుతుందని షాహిద్ అఫ్రిది గట్టిగా నమ్మారు.
అందుకే ఆయన ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. “పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకుంది, ఇప్పుడు ఇండియా ఏ ముఖంతో ఆడుతుందో తెలియదు కానీ, మాతో ఆడాల్సిందే” అని అఫ్రిది వ్యాఖ్యానించారు. భారత ఆటగాళ్లు సెమీస్‌లో కూడా అదే నిర్ణయాన్ని కొనసాగించడంతో అఫ్రిది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యల కారణంగా షాహిద్ అఫ్రిదికి సోషల్ మీడియాలో తీవ్ర అవమానం ఎదురవుతోంది. నెటిజన్లు తనను ట్రోలింగ్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..