మూవీ రివ్యూ: కింగ్డమ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్, అయ్యప్ప పి శర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఇవి కూడా చదవండి
ఎడిటింగ్: నవీన్ నూలీ
సంగీతం: అనిరుద్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్డమ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. మరి విజయ్ ఆశలను ఈ సినిమా నిలబెట్టిందా లేదా చూద్దాం..
కథ:
సూరి (విజయ్ దేవరకొండ) తెలంగాణలోని అంకాపూర్ లో ఒక కానిస్టేబుల్. అతని అన్న శివ (సత్యదేవ్) చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. 18 సంవత్సరాలుగా అన్న కోసం అన్ని చోట్ల వెతుకుతుంటాడు సూరి. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సూరి అన్న డీటెయిల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్కడున్నాడో కూడా చెప్తాడు. కాకపోతే శివను మళ్ళీ తిరిగి తీసుకురావాలి అంటే సూరికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి స్పైగా వెళ్లి వాళ్ల మాఫియా గురించి తెలుసుకోమని చెప్తారు. శ్రీలంకలో సూరికి హెల్ప్ చేయడానికి ఒక స్పై (భాగ్యశ్రీ బోర్సే) ఉంటుంది. అక్కడి నుంచి సూరి మిషన్ శ్రీలంక మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ..
కథనం:
గౌతమ్ తిన్ననూరి అంటే మళ్లీ రావా, జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామాలు గుర్తుకొస్తాయి. కానీ కింగ్డమ్ సినిమాతో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. మొదటి సీన్ నుంచే తన మార్కు చూపించడం మొదలుపెట్టాడు. గ్యాంగ్స్టర్ డ్రామాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు.. కానీ ఉన్న కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు గౌతమ్. ఈ క్రమంలో ఫస్ట్ అఫ్ సూపర్ సక్సెస్ అయింది. హీరో క్యారెక్టర్ పరిచయం చేసిన విధానం కూడా చాలా బాగుంది. అక్కడినుంచి శ్రీలంక వెళ్లిన తర్వాత కథ మరింత వేగంగా ముందుకు వెళుతుంది. ఒకరకంగా చెప్పాలంటే మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లాడు గౌతం. ఫస్టాఫ్ మొత్తం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లాంటి ఇద్దరు పవర్ఫుల్ యాక్టర్స్ దొరకడంతో గౌతమ్ పని ఇంకా ఈజీ అయింది. తాను అనుకున్న సన్నివేశాలు ఇంకా బాగా ఎలివేట్ కావడానికి వీళ్ల నటన బాగా తోడైంది. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ అంతా హీరో శ్రీలంక వెళ్లడం.. అక్కడ స్పైగా మారడం.. హీరో హీరోయిన్ ట్రాక్ వీటితో వెళ్లిపోయింది. అసలైన కథ ఇంటర్వెల్ కు సెటప్ అయింది. సెకండ్ హాఫ్ ఇంకాస్త వేగంగా వెళ్లి ఉంటే బాగుండేది. అయినా కూడా తన మార్కు చూపించాడు గౌతం. దానికి తోడు విజయ్ దేవరకొండ యాక్షన్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సెకండాఫ్ మాత్రం కాస్త స్లో అయింది. చివరి 20 నిమిషాలు ఊపు తీసుకొచ్చాడు. సెకండ్ పార్ట్ కు సరిపోయే లీడ్ ఇచ్చాడు. గ్యాంగ్స్టర్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు కింగ్డమ్ బెస్ట్ ఛాయిస్.
నటీనటులు:
విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించాడు. మరో ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా గ్లామర్ కాకుండా నటనకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా చేస్తుంది. ఇతర కీలక పాత్రలో మలయాళ నటుడు వెంకటేష్ బాగా నటించాడు. సినిమాలో మనోడు కీలకం. తన నటనతో మెంటల్ ఎక్కించేసాడు.
టెక్నికల్ టీం:
అనిరుద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ప్రతి సన్నివేశం తన మ్యూజిక్ తో బాగా ఎలివేట్ చేశాడు. కేవలం అనిరుద్ కారణంగానే కింగ్డమ్ రేంజ్ మరింత పెరిగింది. ఎడిటర్ నవీన్ నూలి కూడా షార్ప్ కట్ చేశాడు. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీల్ వచ్చినా కూడా యాక్షన్ పార్ట్ కవర్ చేసింది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు శ్రీలంక లొకేషన్స్ ఎవరూ చూపించిన విధంగా చూపించారు. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి తన రైటింగ్ పవర్ చూపించాడు. తెలుగు సినిమాకు సరికొత్త ఎమోషనల్ గ్యాంగ్స్టర్ డ్రామా అందించాడు.
ఓవరాల్ గా కింగ్డమ్.. ఎంగేజింగ్ గ్యాంగ్స్టర్ డ్రామా..