
హైదరాబాద్‌లో రెండు వర్గాల మధ్య చిన్నగా మొదలైన వివాదం ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఈ నెల 27న ఖైరతాబాద్ గజ్జలమ్మ ఆలయం వద్ద జరిగిన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జులై 27న ఖైరతాబాద్ గజ్జలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఒక బ్యానర్ విషయంలో ముఖేష్ అనే యువకుడు, సునీల్ అనే యువకుడు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ గొడవ కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. సునీల్ తన ఫ్రెండ్స్ వికేష్, ఫతూ అనే యువకులతో పాటు మరికొంతమంది స్థానిక యువకులను తీసుకొని ముఖేష్‌పై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ముఖేష్ తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. దాడి అనంతరం బస్తీలో పరువు పోయిందని ముఖేష్ అవమానంగా భావించాడు. తీవ్ర మనో వేదనకు గురై అదే రోజు రాత్రి ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వికేష్‌ను సంగారెడ్డి సమీపంలో అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. ఇంకా పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి ముఖేష్ అంత్యక్రియలు జరిగాయి. అతడి మృతి పట్ల స్థానికులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం ఖైరతాబాద్ ప్రాంత వ్యాప్తంగా స్వచ్ఛంద బంద్ పాటించారు. పలుచోట్ల షాపులు మూతపడ్డాయి. యువకుడి మృతికి న్యాయం జరగాలంటూ స్థానికులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.