
మణుగూరు నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడి మద్యం మత్తులో పూజలు చేస్తున్నాడు. మద్యం సేవించి ఆలయంలో పూజలు చేస్తుండటంతో భక్తుల ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈఓ. గర్భగుడిలో హుండీ చాటున మద్యం బాటిళ్లు, గుట్కాలను గుర్తించిన అధికారులు.. ఇవేం గలీజ్ పనులు అంటూ అర్చకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని వెంటనే విధుల నుంచి తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని కాకతీయుల కాలం నాటి శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు రామచంద్రరావుపై ఎండోమెంట్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో శేషయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో అర్చకుడి బాగోతం బయటపడింది. ఈఓ నిర్వహించిన తనిఖీల్లో గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు బయట పడ్డాయి. నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు రామచంద్రరావు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ స్వామివారికి అభిషేకాలు, పూజలు చేస్తున్నాడు. అంతేకాకుండా గుడిలో మద్యం మత్తులో పడుకుంటుండడంతో కొందరు భక్తులు.. దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు, ఆలయంలో సోదాలు నిర్వహించగా.. గుట్కా ప్యాకెట్లతో పాటు గర్భగుడిలో మద్యం సీసాలు బయటపడ్డాయి. అవి చూసి ఆశ్చర్యపోయిన అధికారులు.. అర్చకుడు రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. పవిత్రమైన ఆలయంలో ఇవేం గలీజ్ పనులు అంటూ నిలదీశారు. అర్చకుడు రామచంద్రరావు చేసే నిర్వాకంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించడమే కాకుండా విధుల నుంచి అతడ్ని తొలగించి మరొకరికి అర్చకత్వ బాధ్యతలు అప్పగించారు. శివాలయంలో అర్చకుడి లీలలు బయటపడడంతో హవ్వా.! ఇవేం పనులు అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి