
నెల్లూరు జిల్లాలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్న జగన్‌ను చూసేందుకు భారీ ఎత్తున జనం, కార్యకర్తలు ముందుకొచ్చారు. దీంతో హెలిపాడ్ దగ్గరకు అనుమతి లేదంటూ వచ్చిన కార్యకర్తలను పోలీసులు తరిమేశారు. అక్కడి నుంచి జగన్ కాన్వాయ్‌లో నెల్లూరు జైలు దగ్గరకు వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డితో ఆయన ములాఖత్ అయ్యి ఆయనను పరామర్శించారు. వైఎస్ జగన్ వెంట కాకాణి కూతురు, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెళ్లారు.
కాకాణితో ములాఖత్ తర్వాత జగన్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో జగన్ చూసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ కార్యకర్తలను అనవసరంగా కొడుతున్నారని ఆరోపించారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారని..ప్రజలపై కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడమేంటని ప్రశ్నించారు. జనం రాకుండా రోడ్లు తవ్వేస్తున్నారని.. మీరు ఎన్ని చేసినా వైఎస్‌జగన్ అభిమానులను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.