మొలకెత్తడం అనేది అనేక ధాన్యాలు, చిక్కుళ్ళు , విత్తనాల పోషక విలువలను పెంచే సహజ ప్రక్రియ. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌ల లభ్యతను పెంచుతుంది. అంతేకాదు సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కనుక మొలకెత్తిన వాటిని ఆహారంగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మొలకెత్తిన తర్వాత అన్ని ఆహారాలు తినేందుకు సురక్షితం కాదు. కొన్ని ఆహారాలు మొలకెత్తిన తర్వాత పచ్చిగా తింటే హానికరమైన విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఈ రోజు పోషకాహార నిపుణులు చెప్పిన విధంగా మొలకెత్తిన తర్వాత మీరు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
రాజ్మా:
మొలకెత్తిన రాజ్మాలో ఫైటోహెమాగ్గ్లుటినిన్ అనే టాక్సిన్ ఉంటుంది. కనుక మొలకెత్తిన రాజ్మా గింజలను పచ్చిగా తింటే వికారం, వాంతులు, కడుపు నొప్పి సమస్యలతో పాటు ఒకొక్కసారి ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా కారణమవుతుంది. కనుక రాజ్మా ని తినే ముందు బాగా ఉడికించాలి. మొలకెత్తిన రాజ్మాను పొరపాటున కూడా పచ్చిగా తినకండి.
శనగలు:
మొలకెత్తిన శనగలు పోషకాలతో నిండి ఉంటాయి. అయితే శనగల మొలకలను పచ్చిగా తినడం వలన సున్నితమైన జీర్ణక్రియ లేదా IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) ఉన్నవారిలో గ్యాస్ లేదా ఉబ్బరం కలిగించవచ్చు. కనుక ఎవరికైనా జీర్ణ సమస్యలు ఉంటే.. మొలకెత్తిన శనగలను తక్కువగా తినండి.
వేరుశెనగలు
మొలకెత్తిన వేరుశనగలో అఫ్లాటాక్సిన్ ఉండవచ్చు. ఇవి కాలేయా పని తీరుపై ప్రభావం చూపించవచ్చు. క్యాన్సర్ కారకమైనవి. మొలకెత్తిన వేరుశెనగలను పచ్చిగా తినడానికి బదులుగా వేయించి తినడం సురక్షితం.
బంగాళదుంప: మొలకెత్తిన బంగాళాదుంపలు సోలనిన్ అనే విషపూరిత సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిని అధికంగా తీసుకుంటే హానికరం. తలనొప్పి, వికారం, వాంతులు సమస్యలు కలిగే అవకాశం ఉంది. కనుక మొలకెత్తిన బంగాళాదుంపలను పొరపాటున కూడా తినొద్దు.
పచ్చి సోయాబీన్స్: మొలకెత్తిన పచ్చి సోయాబీన్లలో ట్రిప్సిన్ ఇన్హిబిటర్లు ఉంటాయి. ఇవి ప్రోటీన్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. సోయాబీన్స్‌ను సరిగ్గా ఉడికించిన తర్వాతే తినాలి. వాటిని పచ్చిగా లేదా మొలకెత్తినవి తినకూడదు.