రాగులను ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. కాల్షియం, ఐరన్, ఫైబర్ అధికంగా ఉండే చిరుధాన్యం. రాగులు ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. వీటిలో అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. రాగి తోపు, రాగి సంకటి, రాగి జావ, రాగి ఇడ్లీ ఇలా చాలా రకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. వీటిల్లో రాగి ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపిక. పిల్లలకు అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా ఈ రాగి ఇడ్లీని అందించవచ్చు. ఈ రాగి ఇడ్లీ పిల్లలకు, వృద్ధులకు చాలా ప్రయోజనకరం. కనుక రాగి ఇడ్లీ తయారు చేసే సులభమైన రెసిపీని తెలుసుకుందాం.
రాగి ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి – 1 కప్పు
సుజీ రవ్వ – అర కప్పు
ఇవి కూడా చదవండి
పెరుగు – అర కప్పు
నీరు – అవసరానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
ఈనో లేదా బేకింగ్ సోడా – 1 టీస్పూన్
అల్లం – 1 టీస్పూన్ తురిమిన ముక్కలు
పచ్చిమిర్చి – 1 సన్నగా తరిగిన ముక్కలు
క్యారెట్ – తరుగు
కరివేపాకు – 6 నుండి 7 సన్నగా తరిగినవి (ఐచ్ఛికం)
నూనె లేదా నెయ్యి – గ్రీజు చేయడానికి
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి , సుజీ రవ్వ వేసుకోండి. తరువాత అవసరానికి అనుగుణంగా పెరుగు, నీరు వేసి చిక్కగా పిండిని కలుపుకోవాలి. అయితే పిండి చాలా చిక్కగా ఉండాలి.. పలచగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం ఉబ్బుతుంది.
15 నిమిషాల తర్వాత ఈ రాగి పిండి మిశ్రమంలో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి , కరివేపాకు, క్యారెట్ తరుగు., రుచికి సరిపడా ఉప్పు వేసి వేసి బాగా కలపండి.
ఇడ్లీలు మెత్తగా ఉండేందుకు.. ఈ రాగి పిండి మిశ్రమంలో ఈనో లేదా బేకింగ్ సోడాను వేసి కలపండి. ఇలా రాగి పిండికి ఈనోను జోడించిన వెంటనే పిండిలో కొద్దిగా నురుగు రావడం ప్రారంభమవుతుంది. ఇలా వచ్చిందంటే ఇడ్లీ వేసుకునేందుకు రాగి పిండి రెడీ అయినట్లే.
ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసి అందులో నీరు పోసి.. ఇడ్లీ ప్లేట్స్ కు నెయ్యి రాసి.. రెడీ చేసుకున్న రాగి పిండిని ఆ ప్లేట్స్ లో సమానంగా నింపండి. ఇప్పుడు ఇడ్లీలను ప్రెజర్ కుక్కర్ లేదా స్టీమర్‌లో మీడియం మంట మీద 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి.
ఇడ్లీలు ఉడికిన తర్వాత ప్లేట్స్ నుంచి తీసి ప్లేట్ లో పెట్టి.. కొబ్బరి చట్నీ, సాంబార్ తో వేడి వేడి రాగి ఇడ్లీలను వడ్డించండి. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..