ప్రస్తుతం మిత్రక్షేత్రమైన మిథున రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడికి క్రమంగా బలం పెరుగుతోంది. తన శిష్యుడైన రాహువుకు చెందిన ఆర్ద్రా నక్షత్రంలో సంచారం వల్ల శుక్రుడు మరింత బలంతో కొన్ని రాశులకు యోగాలనివ్వడం జరుగుతుంది. శుక్రుడు ఆర్ద్రా నక్షత్రంలో ఈ నెల 31 నుంచి ఆగస్టు 11 వరకూ సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కలలు సాకారం కావడం, ఆశలు, కోరికలు నెరవేరడం, ఆదాయం వృద్ధి చెందడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారు దీనివల్ల లబ్ధి పొందడం జరుగుతుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ధన స్థానంలో శక్తిని పుంజుకోవడం వల్ల ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీత భత్యాలు, అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఇదే రాశిలో శక్తిమంతుడు కావడం వల్ల విదేశీయానానికి, విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి అన్ని విధాలా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరిగే సూచనలున్నాయి.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శుక్రుడు రాహు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. నిరుద్యోగుల విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు.
- కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు దశమ స్థానంలో బలం పుంజుకోవడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. మరింత మంచి సంస్థలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో, రాహు నక్షత్రంలో ఉన్నందువల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు వంద శాతం ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి అపారంగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడికి మరింతగా బలం కలగడం వల్ల ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి, పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి.