వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే నేను చనిపోతున్నాను అంటూ ఓ గర్భిణి తన తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కేరళలోని త్రిసూర్‌లో చోటు చేసుకుంది. ఫసీలా అనే మహిళ త్రిసూర్ జిల్లాలోని వెల్లంగులర్‌లోని తన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జూలై 29న జరిగింది. ఇరింజలకుడ పోలీసులు ఆమె భర్త నౌఫాల్, అత్త రమ్లను అరెస్టు చేశారు. ఇద్దరినీ బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మెట్టినింట్లో తాను నిత్యం నరకం అనుభవిస్తున్నానని, అత్ ప్రతిరోజూ తనపై దాడి చేస్తున్నారని ఆమె తన తల్లికి మేసేజ్‌లు కూడా పంపింది.
ఫసీలా తన తల్లికి పంపిన మేసేజ్‌లలో తాను రెండవసారి గర్భవతినని, తన భర్త తన కడుపులో చాలాసార్లు తన్నాడని చెప్పింది. వీళ్లు నన్ను చంపేసేలా ఉన్నారని, అందుకే నేను చనిపోతున్నానంటూ ఆ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఇతర సంబంధిత విభాగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిస్సూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
కేరళకు చెందిన మరో మహిళ..
కొల్లంకు చెందిన 29 ఏళ్ల అతుల్య అనే మహిళ జూలై 21న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందింది. ఆమె భర్త ఆమెను హత్య చేశాడని, అది ఆత్మహత్య కాదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొల్లం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆమె కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. 2014లో వారి వివాహం జరిగినప్పటి నుండి, అతుల్య కట్నం కోసం నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతోంది. మరో కేసులో జూలై 8న షార్జాలోని వారి ఫ్లాట్‌లో 32 ఏళ్ల విపాంచిక మణియన్, ఆమె ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె చనిపోయి కనిపించారు. చాలా సంవత్సరాలుగా వరకట్న వేధింపులను ఎదుర్కొంటున్నానని విపాంచిక సూసైడ్ నోట్ రాసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి