తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో అర్థం కావడం లేదు కానీ కొంతమంది చేసే పనులు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇంత నాగరికత పెరిగిన తర్వాత కూడా కొంతమంది ఇంకా అనాకరికంగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏకంగా 40 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఈ దారుణం మరెక్కడో కాదు మన తెలంగాణలోనే అది కూడా హైదరాబాదుకు కూతవేటు దూరంలోనే జరిగింది. హైదరాబాద్ నుండి 55 కి.మీ దూరంలో ఉన్న నందిగామలో ఆ వ్యక్తి, అతని భార్య ఈ చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డారు. పెళ్లికి సిద్ధమైన వ్యక్తి, అతని భార్య అలాగే పెళ్లి జరిపించేందుకు వచ్చిన పూజారి, ఇతరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 8వ తరగతి విద్యార్థిని ఒక దండ పట్టుకుని 40 ఏళ్ల వ్యక్తి ముందు నిలబడి ఉన్నట్లు ఒక ఫొటో ఉంది. వారి పక్కన ఆ వ్యక్తి భార్యగా అనుమానించబడిన ఒక మహిళ, అలాగే పూజారి ఉన్నారు. మన దేశంలో బాల్య వివాహం అనేది పిల్లలపై జరిగే అత్యంత తీవ్రమైన నేరాలలో ఒకటిగా పరిగణిస్తారు. అలాంటిది కేవలం 13 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధం అయ్యాడు. అయితే ఈ విషయం స్కూల్ టీచర్‌కు తెలియడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లను అరెస్ట్ చేశారు. అయితే ఈ పెళ్లికి ఆ విద్యార్థిని ఎలా ఒప్పుకుంది? తల్లిదండ్రుల పాత్ర ఏంటి అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి