ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో దీనిపై దర్యాప్తునకు సిట్‌ను నియమించారు. సిట్ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో డొంక కదిలింది. శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అట్టపెట్టల్లో దాచిన ఈ మొత్తాన్ని రూ.11 కోట్లుగా అధికారలు తేల్చారు.
హైలైట్:
- గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు
- ఏ 40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో డబ్బు సీజ్
- బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం

గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు పలువుర్ని విచారించారు. ఆ క్రమంలో ఏ 40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో శంషాబాద్ శివారులోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో రూ.11 కోట్ల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. నగదుకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించడంతో న్యాయమూర్తి పైవిధంగా ఆదేశించారు. కాగా, నగదు లభ్యమైన ఫామ్‌హౌస్ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కేసిరెడ్డిదిగా చెబుతున్నారు. కాగా, సిట్ ఛార్జ్‌షిట్‌లో పలు ప్రముఖ లిక్కర్ బ్రాండ్లు పేర్లను చేర్చింది.
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. 12 అట్ట పెట్టెల్లో 11 కోట్లు
ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులైన రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వారిని విచారించిన సిట్ అధికారులు.. విచారణలో వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువుర్ని అదుపులో తీసుకున్నారు. వారిలో బునేటి చాణక్య, వరుణ్, వినయ్ తదితరులు ఉన్నారు. రాజంపేట ఎంపీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. కాగా, ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు విదేశాల్లో ఉన్నారని, వారిని సైతం వెనక్కి రప్పిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు.