తెలంగాణ ప్రభుత్వం పౌరులకు ఉపయోగపడే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా యూఎస్ కాన్సులేట్‌ను సందర్శించేందుకు ప్రతిరోజూ వచ్చే వేలాది మంది.. అక్కడ వెయిట్ చేసే సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇకపై ఆ అవస్థలు ఉండవు. ఎందుకంటే.. రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా’ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్ – నానక్‌రామ్‌గూడాలో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉంది. రోజుకు సగటున 3,000 మందికి పైగా యూఎస్ కాన్సులేట్‌కు వస్తుంటారు. అక్కడ టైమ్ స్లాట్ కోసం వెయిట్ చేసేవారు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని.. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఆధునిక వసతులతో ఈ విభాగాన్ని నిర్మించారు. ‘‘మా ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే. పారిశ్రామిక అభివృద్ధితో పాటు, ప్రజల రోజు వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే చర్యలు కూడా తీసుకుంటున్నాం’’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
తెలంగాణ – అమెరికా సంబంధాలు బలపడుతున్నాయని.. మన రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో 38 శాతం అమెరికాకే వెళ్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ఏడాది జనవరిలో అమెరికన్ కంపెనీలు రూ.31,500 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. దీని వల్ల 30,000 ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ కొత్త వెయిటింగ్ ఏరియా ద్వారా వ్యాపార సంబంధాలకే గాక, అంతర్జాతీయ ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..