పచ్చని పల్లెటూరు.. ప్రశాంత వాతావరణం. ఒక్కసారిగా గన్ ఫైరింగ్. బుల్లెట్స్ శబ్దానికి ఊరంతా ఉలిక్కిపడింది. పరుగుపరుగున కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లిన గ్రామస్తులకు భయంకర ఘటన కళ్ల ముందు కనిపించింది..ఇంతకీ అక్కడ ఏమి జరిగింది.? కాల్పులమోతకు కారణమేంటి? ఇదే అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం పల్లపుదుంగాడ గిరిజన గ్రామం. ఊరంతా ఎవరి పనిలో వారుండగా ఒక్కసారిగా గన్ ఫైరింగ్ శబ్దం రావడంతో గ్రామస్తులు అంతా హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. అలా వెళ్లి చూడగా రక్తపుమడుగులో సీదిరి రాము అనే గిరిజనుడు పడి ఉన్నాడు. అదే సమయంలో అక్కడ సీదిరి నాగరాజు తుపాకీ చేతిలో పట్టుకొని కనిపించాడు. పరిస్థితి గమనించిన మృతుడు రాము కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సీదరి రాము తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి చిట్టెంపాడులో నివసించేవాడు. ఈ క్రమంలోనే రాము భార్య చనిపోగా.. ఇద్దరు కూతుళ్ల కు వివాహాలు జరగడంతో రాము ఒంటరయ్యాడు. దీంతో రాము తరచూ తన కూతుళ్ల వద్దకు వచ్చి వెళ్తుంటాడు. అయితే రాముకు గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. ఆ భూమిని తనకు ఇవ్వాలని రాము అన్న కుమారుడు నాగరాజు అడుగుతుండేవాడు. అయితే ఆ భూమి తన ఇద్దరు ఆడపిల్లలకు ఇస్తానని నీకు ఇవ్వడం కుదరదని అతడు చెప్పాడు. తరుచూ భూమి విషయంలో రాముతో నాగరాజు గొడవపడుతూ ఉండేవాడు. అలా నాగరాజు బెదిరింపులు తట్టుకోలేక మూడు నెలల క్రితం రాము తన చిన్న కూతురు నివసిస్తున్న పల్లపుదుంగాడ గ్రామానికి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. కానీ నాగరాజు మాత్రం తన పెదనాన్న గ్రామానికి వస్తే ఏదోలా భూమి కాజేయాలని ప్లాన్ చేసుకున్నాడు. నాగరాజు గ్రామంలో పొలం పనులు చేసుకోవడంతో పాటు నాటుతుపాకీతో కొండ ప్రాంతంలో జంతువులను కూడా వేటాడి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు.
చిట్టెంపాడు నుండి పల్లపుదుంగాడ వెళ్లిన రాము ఎంతకి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నాగరాజు ఉన్న నాటు తుపాకీ తీసుకొని రాము ఉంటున్న పల్లపుదుంగాడ గ్రామానికి వెళ్లాడు. అక్కడ రాము ఆచూకీ కోసం ఎంక్వైరీ చేశాడు. రాము గ్రామ సమీపంలోని పొలంలో పనులు చేస్తున్నట్లు తెలుసుకొని అక్కడకి వెళ్లాడు. అక్కడ పొలం విషయంలో రాముతో నాగరాజు మరోసారి గొడవపడ్డాడు. ఆ తరువాత కాసేపటికి తనతో తెచ్చుకున్న నాటు తుపాకీ తో రాముపై కాల్పులు జరిపాడు. ఆ దాడిలో రాము రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి గమనించిన రాము కుమార్తె నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాము హత్య జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేకాకుండా ఏజెన్సీలో ఇంకా ఎవరైనా నాటు తుపాకి లు కలిగి ఉన్నారేమో అన్న అనుమానంతో పోలీసులు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…