
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పిల్లల ఆరోగ్యంపై పెద్దలంతా టెన్షన్ పడతారు. ఈ వాతావరణంలో పిల్లలు తరచూ జబ్బు పడటం సర్వసాధారణం. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి ఇంకా పూర్తిగా పెరగదు. తేమతో కూడిన వాతావరణం వల్ల వైరస్ లు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్ లాంటి రోగాలు ఈ కాలంలో ఎక్కువ వస్తాయి. పిల్లలు వీటికి త్వరగా గురవుతారు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్షాకాలంలో చిన్న పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు 40 శాతం పెరిగాయి. నీరు నిలవడం, శుభ్రత లేని వాతావరణం, మురికి తాగునీరు దీనికి ముఖ్య కారణాలు.
ఎలా జబ్బులు వస్తాయి..?
మురికి నీరు, శుభ్రత లేకపోవడం వల్ల ఈ కాలంలో E.coli, రోటా వైరస్, హెపటైటిస్ A, కలరా లాంటి వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. వీధి ఆహారం తినడం, బాటిళ్ళు లేదా పాత్రలను ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పిల్లలు అలాంటి వాటికి త్వరగా ప్రభావితం అవుతారు.
మొదట్లో మామూలు లక్షణాలు కనిపించినా పరిస్థితి త్వరగా తీవ్రంగా మారవచ్చు. వాంతులు, విరేచనాలు, నీరసం, నోరు పొడిబారడం, చర్మం పసుపు రంగులోకి మారడం లాంటివి ఎక్కువగా ఉంటే శరీరంలో నీరు తగ్గడం లేదా కామెర్లకు సూచన అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
జబ్బులు రాకుండా ఏం చేయాలి..?
ఈ రకమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తాగే నీటిని మరిగించి వాడాలి. పిల్లలకు వీధి ఆహారాన్ని అస్సలు పెట్టకూడదు. చేతులు తరచూ కడుక్కోవడం, శుభ్రతను పాటించడం తప్పనిసరి. అలాగే టైఫాయిడ్, హెపటైటిస్ A లాంటి వ్యాధులు రాకుండా కావాల్సిన టీకాలు వేయించుకోవడం కూడా అవసరం. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల జబ్బులు మరింతగా పెరుగుతాయి. కాబట్టి శుభ్రమైన పరిసరాలు కూడా చాలా ముఖ్యం.
దోమలు రాకుండా ఇలా చేయండి..
దోమల బెడద తగ్గాలంటే.. మీ ఇంటి చుట్టూ నీరు నిలిచి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంటి ఆవరణలో ఎక్కడైనా నీరు నిలిచి ఉంటే వాటిని తరచూ తనిఖీ చేసి శుభ్రం చేయాలి. పిల్లలను దోమ కాట్ల నుండి కాపాడటానికి దోమతెరలు వాడటం ఉత్తమం. అవసరమైతే దోమలను తరిమే ఇతర సాధనాలను కూడా ఉపయోగించవచ్చు.
వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తిని పెంచవచ్చు. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.