ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అని మనకు తెలుసు. అయితే చాలా మంది విటమిన్ K ప్రాముఖ్యతను పెద్దగా పట్టించుకోరు. ఇది కూడా ఎముకల బలానికి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి రోజూ విటమిన్ K ఎక్కువ ఉండే ఆహారాలు తింటే ఎముకలను కాపాడుకోవచ్చు.
మునగాకు
మునగాకు ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. 100 గ్రాముల మునగాకులో సుమారు 600 మైక్రోగ్రాముల విటమిన్ K ఉంటుంది. దీన్ని తరచూ మీ ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు అద్భుతంగా బలం పుంజుకుంటాయి.
పాలకూర
పాలకూరలో విటమిన్ Kతో పాటు కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. ఉడికించిన పాలకూరలో ప్రతి 100 గ్రాములకు సుమారు 483 మైక్రోగ్రాముల విటమిన్ K లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా చేయడంలో చాలా సహాయపడుతుంది.
మెంతి ఆకులు
తాజా మెంతి ఆకులు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. 100 గ్రాముల మెంతి ఆకులలో సుమారు 180 మైక్రోగ్రాముల విటమిన్ K ఉంటుంది. వీటిని వారంలో కొన్ని సార్లు వంటల్లో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కొత్తిమీర
చాలా మంది కొత్తిమీరను కేవలం అలంకరణకు మాత్రమే వాడతారు. కానీ ఇందులో మంచి మొత్తంలో విటమిన్ K ఉండడం వల్ల ఇది ఎముకలకు అవసరమైన పోషణను అందిస్తుంది.
బ్రోకలీ
విటమిన్ Kతో పాటు ఇతర పోషకాలు కూడా ఉండే బ్రోకలీని ఆహారంలో చేర్చడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇది ఆకుకూరల మాదిరిగానే ఉంటుంది. వంటల్లో సులభంగా వాడవచ్చు.
క్యాబేజీ
ఒక కప్పు క్యాబేజీలో సుమారు 82 మైక్రోగ్రాముల విటమిన్ K ఉంటుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది.
సోయాబీన్స్
సోయాబీన్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ K కూడా బాగా ఉంటుంది. వీటిని కూరల్లో లేదా స్నాక్స్ గా వాడితే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.
పచ్చి బఠానీలు
పచ్చి బఠానీలు ఆహారానికి మంచి రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఒక కప్పు బఠానీలలో సుమారు 25 మైక్రోగ్రాముల విటమిన్ K తో పాటు.. పీచు పదార్థం, ఐరన్, విటమిన్ A, C వంటి పోషకాలు కూడా ఉంటాయి.
గుడ్లు
గుడ్ల పచ్చసొనలో విటమిన్ K1, K2 దొరుకుతాయి. దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)