నిద్ర మన శరీరానికి చాలా అవసరం. కానీ అవసరానికి మించి నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరమే. రోజూ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం.. ఎక్కువ నిద్ర వల్ల జీవనకాలం తగ్గడం, మెదడు పనితీరు తగ్గడం, అలాగే దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ఇది ఒక కారణం కాకపోయినా.. మన శరీరంలో ఏదో లోపం ఉందని చెప్పే లక్షణం కావొచ్చు.
అతి నిద్ర వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు
- మెదడు పనితీరు తగ్గుతుంది.. ఎక్కువగా నిద్రించే వారిలో జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంటుంది.
- దీర్ఘకాలిక జబ్బులు.. అతిగా నిద్రపోవడం వల్ల డిప్రెషన్, మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియ లోపాలు వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.
- గుండె సంబంధిత ప్రమాదాలు.. కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువ నిద్ర వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 46 శాతం వరకు పెరుగుతుంది.
- మరణ ప్రమాదం.. 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వారిలో మరణ ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
అతిగా నిద్ర ఎందుకు వస్తుంది..?
- ఆరోగ్య సమస్యలు.. మధుమేహం, డిప్రెషన్, గుండె సమస్యలు వంటివి ఉన్నప్పుడు అతిగా నిద్ర రావచ్చు.
- నిద్ర నాణ్యత లోపం.. మీరు ఎక్కువ సేపు పడుకున్నా.. నాణ్యమైన నిద్ర లేకపోతే రోజంతా అలసటగా అనిపిస్తుంది.
- మందుల ప్రభావం.. కొన్ని మందులు అతిగా నిద్ర వచ్చేలా చేస్తాయి.
- జీవనశైలి సమస్యలు.. ఒకే షెడ్యూల్ లేకుండా పడుకోవడం, పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం కూడా కారణాలు కావచ్చు.
ఎక్కువగా నిద్రిస్తున్నట్లయితే ఏం చేయాలి..?
- మీరు రోజూ ఎన్ని గంటలు నిద్రపోతున్నారో ట్రాక్ చేయండి.
- మీకు తరచుగా అలసటగా అనిపించినా.. బరువు పెరిగినా లేదా మానసిక స్థితిలో మార్పులు వచ్చినా డాక్టర్‌ను కలవండి.
డాక్టర్ సలహా మేరకు స్లీప్ స్టడీ చేయించుకోవడం మంచిది. - మీ నిద్ర అలవాట్లను మెరుగుపరచుకోండి.. ఒకే సమయానికి పడుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, రాత్రిపూట కెఫైన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం మానేయడం వంటివి చేయండి.
తక్కువ నిద్ర ఎంత ప్రమాదకరమో.. ఎక్కువ నిద్ర కూడా అంతే ప్రమాదకరం. అలసటతో కూడిన ఎక్కువ నిద్ర అనేది ఒక పెద్ద ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరైన వైద్య సలహా తీసుకోవడం అవసరం.