Andhra Pradesh Secretariat Plastic Water Bottles Ban: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చే ఉద్దేశంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 10 నుంచి సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. ఆగస్ట్ 15 నుంచి సెక్రటేరియట్‌లోకి పూర్తిస్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం సిబ్బందికి రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ప్రభుత్వమే అందించనుంది.

మరోవైపు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్లాస్టిక్ వలన పర్యావరణానికి, ప్రజలకు హానీ కలుగుతుందని.. ప్లాస్టిక్ చేసే అనర్థాలు ఏమిటో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోందని అన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపించగలిగితే ప్లాస్టిక్ రహిత రాష్ట్రం సాధ్యమవుతుందని అన్నారు. అందులో భాగంగానే 2026లో వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వీడియో: చీపురు పట్టి చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు
మరోవైపు ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా స్వచ్ఛరథం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. స్వచ్ఛరథం కార్యక్రమంలో.. చెత్తను వేసిన వారికి నిత్యావసరాలు ఉచితంగా అందిస్తారు. స్వచ్ఛరథం గ్రామాల్లోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్లల్లోని చెత్తను స్వచ్ఛరథం సిబ్బందికి అందిస్తారు.
స్వచ్ఛరథం సిబ్బంది ప్రజలు అందించిన చెత్తను తూచి.. లెక్కగట్టి అందుకు సమానమైన నిత్యావసరాలను ఉచితంగా అందిస్తారు. గుంటూరు గ్రామీణం మండలంలో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తారు.