తాజాగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 2023లో విడుదలైన సినిమాలకు అవార్డులు 71జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. 22 భాషల్లో 115 సినిమాలు వీక్షించిన జ్యురీ అవార్డులను అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు అవార్డు లభించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు.
అలాగే ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. మంచి కథ కథనంతో తెరకెక్కిన ఈ మూవీకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అనౌన్స్ చేయడంతో అభిమానులు, చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడం పై స్పందించారు. తాజాగా బాలకృష్ణ కూడా తన ఆనందాన్ని తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ షేర్ చేశారు.
“71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో “భగవంత్ కేసరి” ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే చెందుతుంది. Shine Screens (India) LLP తరఫున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి గారు, హరీష్ పెద్ది గారు, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి గారు, అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది.
జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది” అంటూ బాలకృష్ణ రాసుకొచ్చారు.