చదువుల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. మార్కులు తక్కువ వచ్చాయని, టీచర్లు తిట్టారని, సరిగ్గా చదవడం లేదనే కారణాలతో ఇప్పటికే ఎంతోమంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. రెండు రోజుల క్రితమే ఆదిలాబాద్ రిమ్స్‌లో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మంజీరా ట్రినిటీ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో 13 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆకుల వెంకట లాస్య ప్రియ 17వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగింది.
లాస్య ప్రియ ఇటీవలే నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్ కు తల్లిదండ్రులతో కలిసి హాజరైంది. అయితే సరిగ్గా చదవడం లేదని, మార్కులు తక్కువ వచ్చాయని టీచర్లు తల్లిదండ్రులతో చెప్పగా.. పేరెంట్స్ ఆమెను మందలించారు. దీంతో లాస్యప్రియ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, పైగా తల్లిదండ్రుల మందలింపులతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తోంది. మార్కుల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ దశలో వారితో జాగ్రత్తగా మెలగాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..