ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది.. తాజాగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు, నటులకు డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డులను రాష్ట్రపతి చేతులు మీదగా గ్రహీతలకు అందజేయనున్నారు. 2023 సంవత్సరంలో తెరకెక్కిన సినిమాల్లో వైవిధ్యం, సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత బట్టి అవార్డులను అందజేస్తారు.
తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి
భగవంత్ కేసరి 2023లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 2023 జూన్ 10న చిత్ర యూనిట్ విడుదల చేశారు. ‘భగవంత్ కేసరి’ సినిమా దసరా సందర్బంగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలయింది. భగవంత్ కేసరి విడుదలైన ఆరు రోజుల్లోనే 104 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు వంద కోట్ల పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.