Annadata Sukhibhava Scheme Election Districts: ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే కొన్ని జిల్లాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.. అందుకే ఆదేశాలు జారీ చేశారు.
హైలైట్:
- ఏపీలో ఆ జిల్లాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వరు
- ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఆపాలని ఎన్నికల కమిషన్ ఆదేశం
- ఆ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ డబ్బుల్ని జమ చేయరు

ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు-1, చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో మనీంద్రం ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా జరుగుతోంది. ఎన్నికల కోడ్ కొండపి, కడియపులంక గ్రామ పంచాయతీలు.. కారంపూడి, విడవలూరు, రామకుప్పం మండలాలు.. పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లలో అమల్లో ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఈ పథకానికి అర్హులైన రైతులందరి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ పథకం ద్వారా 46,85,838 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున లబ్ధి చేకూరుతుంది.. మొదటి విడతలో రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
అన్నదాతాసుఖీభవ పథకానికి అర్హులైన రైతుల పేర్లు జాబితాలో లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు, కేంద్రం రూ.831.51 కోట్లు ఈ పథకం కోసం ఇస్తున్నాయి.