ప్రస్తుత ఏఐ యుగంలో ప్రజలు ప్రతి చిన్న అవసరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. నిపుణులు అవసరం లేకుండా ఏఐ సలహాలతోనే అన్ని కార్యకలాపాలను పూర్తి చేసుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల అందుబాటులోకి వచ్చిన OpenAI చెందిన ChatGPT. ఇంది అందుబాటులోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే విపరీతమైన ప్రజాధరణ పొందింది. జనాలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు, తమ జ్ఞనాన్ని పెంచుకునేందుకు, ఇలా ప్రతి అవసరానికి ChatGPTని వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా.. ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తుందని యూజర్స్ చెబుతున్నారు.
రోజుకూ ChatGPT ఎన్ని ప్రశ్నలను ప్రాసెస్ చేస్తోంది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ChatGPT ఎన్ని ప్రశ్నలు ఎదుర్కొంటుందో( జనాలు అడుగుతున్నారో) మీరు అస్సలు ఊహించలేరు. వార్తా సంస్థ Axios ప్రకారం, ChatGPT ప్రతిరోజూ 2.5 బిలియన్ ప్రాంప్ట్‌లను (ప్రశ్నలు) ప్రాసెస్ చేస్తోంది. ఈ ప్రశ్నలలో దాదాపు 330 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ నుండే వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ChatGPT ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందనేది.
ChatGPT వర్సెస్ గూగుల్..
ChatGPTని మనం దీన్ని గూగుల్‌తో పోల్చి చూస్తే, గూగుల్ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. గూగుల్ ప్రతిరోజూ 14 బిలియన్ నుండి 16 బిలియన్ సెర్చ్ క్వెరీలను నిర్వహిస్తుంది. ఆల్ఫాబెట్ ప్రకారం, గూగుల్ లో ఏటా దాదాపు 5 ట్రిలియన్ సెర్చ్‌లు జరుగుతాయి, అంటే రోజుకు దాదాపు 13.7 బిలియన్ సెర్చ్ లు. ఈ సంఖ్య రోజుకు 16.4 బిలియన్ సెర్చ్‌లకు చేరుకోవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ChatGPT ప్రస్తుతానికి గూగుల్ కంటే వెనుకబడి ఉంది, కానీ ఇది కొద్ది రోజుల్లోనే ఈ టార్గెట్‌ను చేరుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, ChatGPT రోజుకు 1 బిలియన్ క్వెరీలు వస్తున్నాయని అన్నారు. అంటే ఈ సంఖ్య కేవలం 8 నెలల్లోనే రెట్టింపు అయింది.
ChatGPT ఎందుకు అంత ప్రజాదరణ పొందుతోంది?..
ChatGPTకి ప్రజాదరణ వేగంగా పెరగడానికి ప్రధాన కారణం దాని GPT-4o మోడల్. ఈ మోడల్ గొప్ప పనితీరుతో పాటు యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. అందుకే ప్రజలు దీన్ని ఎక్కువగా వాడడానికి సుముఖత చూపిస్తున్నారు. జనాలు ChatGPTని కేవలం ‘శోధన’ కోసం మాత్రమే కాకుండా, మేధోమథనం, కంటెంట్ సృష్టి, సమస్య పరిష్కారం, కోడింగ్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఈ గణాంకాల ఆధారంగా, రాబోయే రోజుల్లో, ఇంటర్నెట్‌లో అడిగే బిలియన్ల కొద్దీ ప్రశ్నలు ‘సెర్చ్ బార్’లో కాకుండా ‘చాట్‌బాక్స్’లో అడుగుతారని కొందరు భావిస్తున్నారు. దీని అర్థం AI చాట్‌బాట్‌లు, సెర్చ్ ఇంజన్‌ల మధ్య పోటీ మరింత పెరగవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.