తెలుగు ప్రజలలో సినిమా స్టార్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్స్‌కి దేవుళ్ల స్థాయిలో గౌరవం ఇస్తారు చాలామంది అభిమానులు. తమకు ఇష్టమైన సినిమాలు విడుదలవుతుంటే పండుగ వాతావరణమే నెలకొంటుంది. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, తోరణాలు, పాలాభిషేకాలు, డప్పుల మోతతో బాణాసంచా పేల్చడాలు వంటివి తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం. అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూడటం కోసం వారు సమయం, డబ్బు పట్టించుకోకుండా పరుగులెడతారు. అయితే ఈ అత్యుత్సాహం కొన్ని సార్లు అనుకోని ప్రమాదాలకు దారితీస్తోంది. అభిమానుల తుంటరి పనులు తీవ్ర విషాదాలుగా మారిన ఘటనలు గతంలో చూశాం. అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా నివారించేందుకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలోని థియేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. థియేటర్ పరిసరాల్లో బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించారు.
ఈ మేరకు హీరోల అభిమానులకు థియేటర్ యాజమాన్యాలు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశాయి. థియేటర్ ముందు బాణాసంచా కాల్చినవారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ థియేటర్ల ఆవరణలో వాల్‌పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ చర్యల వెనుక గతంలో జరిగిన ఒక దుర్ఘటన ప్రధాన కారణంగా నిలిచింది. 2023 డిసెంబర్ 4న జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదల సందర్భంగా అభిమానులు థియేటర్ ముందు బాణాసంచా కాల్చారు. ఆ సమయంలో విసిరిన నిప్పురవ్వలు పక్కనే ఉన్న ఎన్టీఆర్ కటౌట్‌ను అంటుకొని దగ్దమయ్యింది. ఈ ఘటనతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యాలు ఇప్పుడు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఈ చర్యలు అభిమానుల ఉత్సాహాన్ని అణచే ఉద్దేశంతో కాకుండా, వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న చర్యలని థియేటర్ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. పండుగలా జరుపుకునే సినిమా విడుదల వేడుకలు ఎలాంటి ప్రమాదాలకు దారితీయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.