హైదరాబాద్, ఆగస్టు 2: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. జూలై 15న పరీక్షలు నిర్వహించిన రెండు వారాల తర్వాత ఫలితాలు ప్రకటించడం గమనార్హం. 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 1,43,581 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరిలో 1,38,666 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. తాజా ఫలితాలలో 53,201 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే కేవలం 38.36 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది.
సీబీఎస్సీ 12వ తరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బాలికలు అధికంగా 41.35% ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలుర ఉత్తీర్ణత రేటు 36.79%గా నమోదైంది. బాలురు కంటే బాలికలు 4.56% ఎక్కువ ఉత్తీర్ణత నమోదు చేసుకున్నారు. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులలో ఎవరూ ఉత్తీర్ణత సాధించక పోవడం గమనార్హం. విదేశీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో 918 మంది పరీక్షలు రాయగా.. అందులో 486 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 52.94% ఉత్తీర్ణత శాతం. ఇక ప్రత్యేక అవసరాలు గల పిల్లల (CWSN) ఉత్తీర్ణత 50.18%గా ఉంది. పరీక్షకు హాజరైన 273 మంది అభ్యర్థులలో 137 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలను వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
రెగ్యులర్ విద్యార్థులకు పాఠశాలల ద్వారా మార్కుల షీట్లు-కమ్-పాసింగ్ సర్టిఫికెట్లు పంపిణీ చేస్తామని CBSE బోర్డు తెలిపింది. ఢిల్లీలోని ప్రైవేట్ అభ్యర్థులు వారి పరీక్షా కేంద్రాలలో వారి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఢిల్లీ వెలుపల ఉన్నవారు వారి దరఖాస్తు ఫారమ్‌లలో అందించిన చిరునామాకు పోస్టు ద్వారా అందచేస్తామని బోర్టు తెలిపింది. సప్లిమెంటరీ ఫలితాల వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 6న ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రత్యేక సర్క్యులర్ త్వరలోనే జారీ చేయనుంది. మరోవైపు సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు కూడా ఒకటి, రెండు రోజుల్లోనే విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.