Five IT Companies Comes to Visakhapatnam: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ఐదు ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రభుత్వం వీటికి భూములు కేటాయించింది. ఐదు కంపెనీలు కలిపి రూ.19 వేలకు పైచిలుకు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారుగా 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు. ఐదు ఐటీ సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

సిఫీ ఇన్ఫినిటీ స్పేషెస్ లిమిటెడ్ అనే సంస్థ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.15,226 కోట్లతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో పరదేశీపాలెంలో సిఫీ సంస్థకు ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 25 ఎకరాలు కేటాయించారు. అలాగే మధురవాడ ఐటీ సెజ్‌లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలు కేటాయించారు. ఈ పెట్టుబడుల ద్వారా 600 మందికి ఉపాధి దక్కనుంది. ఇక సత్వ డెవలపర్స్ అనే సంస్థ విశాఖలో రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మధురవాడలో ఎకరా కోటిన్నర చొప్పున 30 ఎకరాలు కేటాయించారు. సత్వ పెట్టుబడులతో సుమారుగా 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇక ఏఎన్ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వేయి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఐటీ సెజ్‌లో ఎకరా 99 పైసల చొప్పున 10.29 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ పెట్టుబడులతో పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.పేనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధురవాడలోని హిల్-2లో 45 సెంట్లు, రుషికొండ ఐటీ పార్క్‌లో 4 ఎకరాలు మొత్తంగా ఎకరా రూ.4.05 కోట్లతో 4.45 ఎకరాలు కేటాయించారు.
పేనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.207.5 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీనిద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్ల ధరతో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. బీవీఎం ఎనర్జీ సంస్థ రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.