కాన్పూర్‌లో కళ్యాణ్‌పూర్ లోని ఒక వీధిలో తాగిన మత్తులో ఉన్న ఒక పాములవాడు సంచలనం సృష్టించాడు. శ్రావణ మాసంలో పాములకు పూజ అంటూ పాముని భక్తులకు చూపించే నెపంతో షాప్స్ దగ్గరకు వెళ్లి డబ్బు అడుగుతున్నాడు. మొదట్లో దుకాణదారులు అతన్ని పట్టించుకోలేదు. అయితే అతను పదే పదే డబ్బు డిమాండ్ చేసి వారిని వేధించడం ప్రారంభించాడు. దీంతో కొంతమంది దుకాణదారులు అతడిని తమ దుకాణం ముందు నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న ఆ పాములను పట్టుకునే వ్యక్తికి కోపం వచ్చింది. తన దగ్గర ఉన్న పాముల బుట్ట నుంచి పామును బయటకు తీశాడు.
పాముని బయటకి తీసిన వంటనే మార్కెట్ అంతా గందరగోళం నెలకొంది. పాములవాడు మొదట బయటకు తీసి పాముతో దుకాణదారులను భయపెట్టడానికి ప్రయత్నించాడు. ప్రజలు భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు. సమీపంలోని కస్టమర్లలో కూడా తొక్కిసలాట జరిగింది. ఇంతలో అక్కడ సమీపంలో ఉన్న పోలీసులు కూడా పరిస్థితిని నియంత్రించడానికి వచ్చారు. అయితే మద్యం మత్తులో ఉన్న పాముల వాడు పామును చూపించి పోలీసులను భయపెట్టడానికి ప్రయత్నించాడు.
ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం ప్రకారం.. పాములవాడు పదే పదే పామును చూపిస్తూ.. ఎవరైనా తనను ఇబ్బంది పెడితే పామును వదిలేస్తానని బెదిరించాడు. మార్కెట్‌లో ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది దుకాణదారులు తమ దుకాణాలను మూసివేశారు.
ఇవి కూడా చదవండి
ఈ నాటకం దాదాపు అరగంట పాటు కొనసాగింది. పోలీసులు, స్థానిక ప్రజలు అతనితో పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఎవరి మాటలు అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అక్కడ ఉన్నవారికి సహనం నశించి చివరికి దుకాణదారులు కోపంతో అంతా ఏకమై అతనిని చుట్టుముట్టడానికి సిద్ధమై పాముల వాడి వైపుకు వెళ్ళినప్పుడు.. పాములవాడికి భయం వేసింది. అందరూ కలిసి తనని కొట్టేస్తారు అని భావించి పరిస్థితి మరింత దిగజారడం చూసి.. వెంటనే పామును పాముల పెట్టెలో వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
అక్కడ ఉన్న కొంతమంది ఈ సంఘటన మొత్తం దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు పాములు పట్టే వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన స్థానిక ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు దీనిని ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రత్యేకమైన గొడవ అని పిలుస్తున్నారు.