ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసి, వరద నీటికి ఇళ్లు మునిగిపోతే.. ఆ ఇంటి వాళ్లు వర్షాన్ని, వరదల్ని, ఆ దేవుడ్ని కూడా తింటుకుంటారు. కానీ, ఓ పోలీస్ అధికారి మాత్రం అందరికీ భిన్నంగా ప్రవర్తించాడు. తన ఇంటిని ముంచెత్తిన వరద నీటిని.. వరదలా కాకుండా వరంలా భావించాడు. వరద నీటికి పూలు చల్లి, పాలతో అభిషేకం చేసి, నమస్కరించాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. పైగా పోలీస్ అధికారి చేసిన ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చంద్రదీప్ నిషాద్ అనే అధికారి రెండు వీడియోలను పోస్ట్ చేశారు. వాటిలో ఒకదానిలో యూనిఫాం ధరించి ఓ ఇంటి ముందు నిలిచిపోయిన వరద నీటిలో గులాబీ రేకులు వేసి ఆ తర్వాత పాలతో అభిషేకం చేసి “జై గంగా మైయా కి” (గంగమ్మకు జై) అని నమస్కరించాడు. “ఈ రోజు ఉదయం డ్యూటీకి బయలుదేరుతుండగా గంగా మాత మా ఇంటికి వచ్చింది. నా ఇంటి గుమ్మం వద్ద గంగా మాతను పూజించి ఆశీస్సులు పొందాను. గంగా మాతకు నమస్కారం” అనే క్యాప్షన్ తో ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు.
మరొక వీడియోలో నిషాద్ తన ఇంటి లోపల నడుము స్థాయి కంటే పైకి ఉన్న నీటిలో మునిగిపోతున్నట్లు కనిపించారు. “వేలాది మంది భక్తులు నీ(గంగా) వద్దకు వస్తారు, కానీ నువ్వే నన్ను ఆశీర్వదించడానికి వచ్చావ్” అని మరో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలకు ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు అతని భక్తిని ప్రశంసించగా, మరికొందరు వరద పరిస్థితి తీవ్రతరం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో ఇళ్లు మునిగిపోతూ ఉంటే.. ఒక పోలీస్ అధికారి ఇలా చేయడం ఏంటని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తెచ్చినందుకు సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేయకుండా ఇలా వీడియోలు చేయడంపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి