లెటజ్ స్టార్ట్ ది గేమ్ అంటోంది తెలంగాణలో రేవంత్ సర్కార్.. పాత క్రీడావిధానాన్ని సమూలంగా మార్చి.. సరికొత్త స్పోర్ట్స్ పాలసీతో దూసుకెళ్తోంది. హైదరాబాద్ HICC వేదికగా జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఫస్ట్ ఎడిషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నూతన క్రీడా విధానం ఆవిష్కృతమైంది. ఒలింపిక్ పతకాలే మన పాలసీ లక్ష్యమని, ఆ విధంగా తెలంగాణ సర్కార్ దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. యువత క్రీడామైదానాల్లో లేకపోవడంతో దేశం చాలా నష్టపోతోందన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియమ్‌ను ప్రస్తావించారు.
ఉద్యమంలో ముందుభాగంలో నిలబడి పోరాడిన యువత.. గత ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడం వల్ల వ్యసనాల బారిన పడిందని ప్రభుత్వం భావిస్తోంది. యువతీయువకుల్లోని బలమైన పోరాట స్పూర్తిని క్రీడల వైపు మళ్లించాలన్నది సర్కార్ ఆలోచన. క్రీడా విధానంలో రాజకీయాల జోక్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పబ్లిక్, ప్రైవేట్ ఉమ్మడి భాగస్వామ్యంతో కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించారు. కార్పొరేట్ కంపెనీల్లో సక్సెస్ స్టోరీ ఉన్నవాళ్లు, క్రీడల్లో రాణించి పతకాలు తెచ్చి దేశానికి గర్వకారణంగా నిలబడ్డవాళ్లు పాలసీలో కీలకంగా మారబోతున్నారు.
చదువుల్లోనే కాదు, క్రీడల్లో రాణించేవాళ్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని, అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, రవికాంత్, సిరాజుద్దీన్, నికత్ జరీన్ లాంటి స్పోర్ట్స్ స్టార్ల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీపడుతున్నాం.. క్రీడల విషయంలో మాత్రం ఎందుకు బలహీనంగా ఉన్నాం.. అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. భారత్‌కు బలమైన క్రీడావేదిక కావాలి.. అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..