యేటా లక్షలాది మంది పొగాకు వాడకం వల్ల మరణిస్తున్నారు. ధూమపానం అలవాటు మానలేకపోతే ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితానికి దూరమవుతాడు. అందుకే పొగాకు, ధూమపానంకి దూరంగా ఉండాలి. ఈ అలవాటును సులభంగా మానేయడానికి కొన్ని చిట్కాలను నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది పొగాకు వినియోగించే ప్రదేశాలకు, వ్యక్తులకు దూరంగా ఉండాలి.
పొగాకు, సిగరెట్ కోరికను అదుపు చేయడానికి ఎల్లప్పుడు తమను తాము బిజీగా ఉంచుకోవాలి. ఒకసారి మీరు ధూమపానం మానేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. ఒక్కసారికి ఏం కాదులే అనుకోవడం ఎప్పుడూ సరైనది కాదు.
క్రమం తప్పకుండా ధ్యానం, యోగా, వ్యాయామం చేయడం వల్ల ధూమపానం మానేయవచ్చు. ఈ పనులన్నీ క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరం మెరుగుపడుతుంది. తేడా సులభంగా మీరే గుర్తిస్తారు.
ధూమపానం వాడకాన్ని మానేసిన వ్యక్తులతో, జీవితంలో ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తులతో సహవాసం చేయాలి. అలాగే మీరు ధూమపానం చేసే వస్తువులు కొనుగోలు చేసే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
సిగరెట్లు మానేయాలని నిర్ణయించకున్నవారు చూయింగ్ గమ్ నమలవచ్చు. నెల మొత్తం ధూమపానం కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో లెక్కించి చూసుకోవాలి. ఆ ఖర్చును ఆదా చేయడం గురించి ఆలోచించడం ద్వారా ధూమపానం మానేయాలనే కోరిక మరింత పెరుగుతుంది. ఆ డబ్బును ఆదా చేసి ఇతర అవసరాలకు ఖర్చు చేయవచ్చు.