కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.
ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున తమ ప్రయత్నాలూ చేస్తున్నామని.. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నామని.. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే.. తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే.. అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీంకోర్టుకు గతంలోనే చెప్పింది.
ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే.. యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..