వరంగల్, జూన్ 25: అమెరికా జైలులో తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సదరు యువకుడు జైలులో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. మృతుడిని జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్(31)గా గుర్తించారు. జులై 26న ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన కుర్రెముల ఉప్పలయ్య, శోభ దంపతుల కుమారుడు కుర్రెముల సాయికుమార్ (31) పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఒక్లహోమాలో సాయికుమార్ 15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ, ముగ్గురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన డిమాండ్లకు అంగీకరించని మరో 19 మంది బాలికల అసభ్య చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో FBI 2023 అక్టోబర్‌లో నిందితుడు సాయి కుమార్‌ను అరెస్ట్ చేసింది.
దర్యాప్తులో బాలుడిగా నటిస్తూ బాలికలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలపై లైంగిక దోపిడీ, అశ్లీల చిత్రాలను పంపిణీ చేసినందుకు ఈ ఏడాది మార్చి 27న అమెరికా కోర్టు సాయికుమార్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో మానసిక క్షోభకు గురైన సాయికుమార్ జులై 26న జైలులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ కుటుంబ సభ్యులు అమెరికాకు వెళ్లి అక్కడే అతడి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.