ఆగష్టు 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేశారు. అయితే కొంతమంది రైతుల ఖాతాలో నిధులు జమ కాలేదు. అలాంటి వారి కోసం అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నిధులు జమ కాని రైతులు అందుకు కారణాలు తెలుసుకొని, సమస్యలు పరిష్కరించుకుంటే నిధులు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు 3 అనగా నేటి నుంచే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆ వివరాలు..
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్ రైతులకు అలర్ట్
- అన్నదాత సుఖీభ నిధులు జమ కాని వారికి సూచన
- ఆగస్టు 3 నుంచి ఫిర్యాదుల స్వీకరణ

అయితే నిధులు జమ కాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. అసలు సమస్య ఏంటి.. ఎందుకు నిధులు జమ కాలేదో తెలుసుకుని.. ఆసమస్యలను పరిష్కరించుకోవాలని.. ఆ తర్వాత వారి ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. వీరితో పాటు తిరస్కరణకు గురైన రైతులు.. గ్రామ రైతు సేవా కేంద్రాల్లో కంప్లైంట్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.
ఈకేవైసీ సమస్యలు, ఎన్‌పీసీఐలో ఖాతాలు సక్రమంగా లేని వారు, ఎన్నికల నియమావళి, భూయజమానులు చనిపోయాక వారసులు పాసు పుస్తకాలు పొందడంలో ఆలస్యం అయిన వారు, వెబ్ ల్యాండ్, మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మైనర్లు, 10 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా అందించే రూ.6,000లకు అదనంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14000 కలిపి.. మొత్తం రూ.20,000లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఇక ఈ పథకం ద్వారా ఏపీలో ప్రతి సంవత్సరం 46,85,838 మంది రైతులకురూ.20 వేల చొప్పున లబ్ధి చేకూరుతుంది.