అమరావతి, జూన్ 28: కూటమి సర్కార్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర విద్యా విధానంలో పలు కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి జిల్లాకు ఒక్కో పరీక్షల బోర్డును ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటిని ఆయా జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న డీసీఈబీల స్థానంలో ఏర్పాటు చేయనున్నారు. జిల్లా పరీక్షల బోర్డులో జిల్లా విద్యాధికారిని ఛైర్మన్‌గా ఉంటారు. సార్వత్రిక విద్యా పీఠం సమన్వయ అధికారులను కార్యదర్శులుగా నియమించనున్నారు.
స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులను అకడమిక్ కార్యదర్శులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా బోర్డుల్లోనే ఒకటి నుంచి పదో తరగతి వరకు సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను రూపొందించనున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు మినహా మిగిలిన అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలను జిల్లా స్థాయిలోనే రూపొందించడంలో ఆయా జిల్లాల పరీక్షల బోర్డులు కీలకంగా మారనున్నాయి. ఈ ప్రశ్నపత్రాల ప్రమాణాలను ఏపీ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) నిర్ణయిస్తుంది. ఆ మేరకు 1969 తర్వాత తొలిసారిగా ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగంపై నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా రాష్ట్ర పాఠశాల ప్రామాణిక అథారిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత మార్పుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేస్తారు. ఇక పదో తరగతి పరీక్షల విభాగాన్ని మాత్రం స్వయం ప్రతిపత్తి కలిగిన విభాగంగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్ష మూల్యాంకనం విషయంలోనూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో టీచర్లు ఎవరైనా తప్పుల చేస్తే వారి సర్వీసు పాయింట్లలో కోత విధిస్తారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో తప్పు వల్ల 10 నుంచి 20 మార్కులు తేడా వస్తే సర్వీసులో 0.5 పాయింట్లు, 20 నుంచి 30 మార్కులు తేడా వస్తే ఒక పాయింటు, 30 పైన మార్కులు తేడా వస్తే 2 పాయింట్ల చొప్పున కోత విధిస్తారు. ఇలా పాయింట్లలో కోత పడటంతోపాటు బదిలీల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని విద్యాశాఖ హెచ్చరించింది. అంతకుమించి తప్పిదాలు చోటుచేసుకుంటే జరిమానా సైతం విధిస్తారు. ఇంక్రిమెంట్లలోనూ కోత పెడతారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.