పురాతన దేవాలయాలు.. రాజులు పాలించిన కోటలు.. లాంటి చోట దండిగా గుప్త నిధులు ఉంటాయని.. స్వామీజీలు చెప్పారని.. చాలామంది గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి కటకటాల పాలయ్యారు. మూఢనమ్మకాలతో.. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుప్త నిధుల కోసం శివలింగాన్నే టార్గెట్ చేశారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
గుప్త నిధులు ఉన్నాయన్న అనుమానంతో ఏకంగా శివలింగాన్నే పెకిలించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ ఆలయం ఊరు బయట ఉండడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. పోలీసులు గుప్తనిధుల తవ్వకాలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని గుడిబండ పై ఉన్న శివకేశవ ఆంజనేయ ఆలయ ఆవరణలో ఉన్న అతి పురాతనమైన శివ పంచాయతన ఆలయంలో జరిగిందీ దారుణం.
కొద్దిరోజుల క్రితం కొంతమంది దుండగులు అతి పురాతనమైన శివలింగం కింద గుప్త నిధులు ఉన్నాయన్న అనుమానంతో శివాలయంలోని రెండు శివలింగాలను పెకిలించి, పక్కకు పెట్టారు. అయితే ఈ ఆలయం పక్కనే నూతనంగా నిర్మించిన రెండు ఆలయాలు ఉన్నాయి. దీంతో ఈ పాత శివాలయంలో పూజలు చేయడం లేదు. అతి పురాతన మైన ఈ శివాలయంలో శివలింగం కింద నిధులు ఉంటాయని దుండగులు భావించారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండు శివలింగాలను పెకిలించి, పక్కకు పెట్టడంతో ఈ విషయం కొంత ఆలస్యంగానే గ్రామస్తులకు తెలిసింది. అయితే శివలింగం కింద నిధులు ఎత్తుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇదే ఊర్లో గతంలో కూడా పాండవుల గుట్ట వద్ద గుప్త నిధులు కోసం తవ్వకాలు జరిపారు గుర్తుతెలియని వ్యక్తులు.
అయితే ఈ తవ్వకాలు ఎవరు చేపట్టారని పోలీసులు ఆరా తీస్తున్నారు. శివలింగాన్ని ధ్వంసం చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివలింగాన్ని పెకిలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. నిందితుల ను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం తవ్వకాలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీసుల నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..