ఢిల్లీ, ఆగస్టు 3: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2025 పరీక్ష ప్రశ్నాపత్రంలో తీవ్రమైన తప్పిదాలు దొర్లాయంటూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటీషన్లను విచారించిన జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. విచారణ సమయంలో మూడు ప్రశ్నల్లోని తప్పుల వల్ల 13 మార్కుల వ్యత్యాసం వస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఈ పరీక్ష ఇప్పటికే ముగిసిందని, ఫలితాలు వెలువడ్డాయని, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని ధర్మాసనం పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు పిటిషన్లను తిరస్కరించింది. విచారణ సమయంలో పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాదికి సంబంధిత హైకోర్టును సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. ‘మీరు దీన్ని ఉపసంహరించుకుని హైకోర్టుకు వెళ్లండి. మేము మీ వ్యాజ్యాన్ని ముగించాలనుకోవడం లేదు. ఈ మూడు ప్రశ్నలపై మూడు రోజుల్లో అభిప్రాయం చెప్పగల నిపుణుల బృందాన్ని నియమించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
అయితే పిటిషనర్ తరపు న్యాయవాది సమాధానం ఇస్తూ.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో MBBS, BDS, ఆయుష్ ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందని అన్నారు. నిపుణుల ప్యానెల్ అభిప్రాయాలను విన్న తర్వాత ధర్మాసనం తన అభిప్రాయానికి తెలియపరచాలని ఆయన కోరారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించడానికి బెంచ్ సుముకత వ్యక్తం చేయకపోవడంతో పిటిషనర్ తరపు న్యాయవాది దానిని ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు జులై 4న NEET-UG 2025 ఫలితాలను సవాలు చేస్తూ దాఖలైన ప్రత్యేక పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.