నోయిడాలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక సంఘటన ఒక యువకుడి జీవితాన్ని పూర్తిగా తుడిచేసింది. అంకిత్ అనే యువకుడు భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు నెలల క్రితం వివాహం అయిన అంకిత్ భార్య, అర్థంలేని కారణాలతో తన ఇంటిని వదిలి వెళ్లిపోయిన తర్వాత అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసి జీవితంపై ఆశ కోల్పోయాడు. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య తనకు చేసిన మోసాన్ని, తన బాధను వివరిస్తూ ఒక వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆతని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియోలో అతడు తన భార్య మోసం చేసిన తీరు, ఆ మోసం తనపై చూపిన ప్రభావం, న్యాయాన్ని కోసం తాను చేసిన ప్రయత్నంలో ఎలా విఫలమయ్యాడో వివరించాడు.
అతడు వీడియోలో చెప్పిన విషయాల ప్రకారం.. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు నాలుగు రోజులపాటు నోయిడా సెక్టర్ 39 పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ చౌకీ చుట్టూ తిరిగినా తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతడు ఆరోపించాడు. పోలీసుల నిర్లక్ష్యమే తన ఆత్మహత్యకు కారణమని చెప్పుకొచ్చాడు. దీంతో ఇది స్పష్టంగా పోలీసులపై ప్రజల నమ్మకాన్ని బలహీనపరచే ఘటనగా నిలిచింది. అతడు ఆత్మహత్య చేసుకునే ముందు కావడి యాత్రలో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో భార్య లేకపోవడం గమనించాడు. విచారణలో ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఈ వాస్తవం అతడిని తీవ్రంగా కలచివేసింది.
అంకిత్ తాను ఎదుర్కొన్న దుస్థితి అందరికీ అర్థమయ్యేలా వీడియోలో వివరించాడు. ఒక వైపు ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం, న్యాయం చేయాలని వెళ్లితే అధికారులు పట్టించుకోకపోగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం అతన్ని మానసికంగా కుంగదీశాయి. అవన్ని తట్టుకోలేక ఆతను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడికి న్యాయం జరగాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించి బాధితుడిని సానుభూతితో వినుంటే, ఓదార్చి ప్రోత్సహించి ఉంటే అతడు బతికి ఉండేవాడేమో అన్న ఆలోచన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.