APSRTC NMUA Workers calls for dharna: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభానికి అడుగులు చక చకా పడుతున్నాయి. ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించునున్నారు. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఏ బస్సుల కండీషన్ ఎలా ఉందనే దానిపై సమీక్షలు, కసరత్తులు జరుపుతున్నారు. అయితే ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు కానుండగా.. అందుకు మూడు రోజుల ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

*ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ ఇవే..
ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన సెటిల్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలు చేపట్టనున్నారు. ఈ డిమాండ్లతో పాటుగా ఆర్టీసీ సంస్థ ఆస్తులను పరిరక్షించాలంటూ ఆగస్ట్ 12, 13 తేదీలలో ధర్నాలకు దిగుతున్నట్లు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (NMUA) ఆదివారం ప్రకటన జారీ చేసింది. ఈ డిమాండ్లతో ఆగస్ట్ 12, 13వ తేదీలలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు ఎన్ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. విజయవాడలో లులు మాల్ ఏర్పాటు కోసం ఆర్టీసీ స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు విలువచేసే సంస్థ ఆస్తులను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని ఎన్ఎంయూఏ డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరింది.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏయే బస్సులలో అంటే?
మహిళా సాధికారతను ప్రోత్సహించడంతో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయనుంది. ఏపీఎస్ఆర్టీసీ వద్ద ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నాయి. వీటిలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసే బస్సులు అయిన.. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల వాటా 8,548 (74 శాతం). ఈ బస్సులతో పాటుగా విద్యార్థుల కోసం ఆర్టీసీ నడుపుతున్న బస్సులు, డిపోలలోని స్పేర్ బస్సులను కూడా పథకం కోసం ఉపయోగించనున్నారు.
టికెట్ తీసుకోమంటే.. చంద్రబాబు వీడియో చూపించారు.. ఇదేందమ్మా?
ఉచిత బస్సు ప్రయాణం – కావాల్సిన గుర్తింపు పత్రాలు
ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కోసం గుర్తింపు కార్డులు తప్పనిసరి. కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి వాటితో మహిళలు నిర్దేశించిన బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. పథకం అమల్లో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఈ టికెట్లలో ప్రయాణ వివరాలు, ఎంత డబ్బులు ఆదా అయ్యాయనే వివరాలు పొందుపరచనున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలు అందరికీ ఈ పథకం వర్తింపచేయనున్నారు.