AP Government Give 10 Percents bars to Kallu Geetha Karmikulu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ అమలు చేయనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బార్ పాలసీ గడువు ఆగస్ట్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నారు. మరోవైపు కొత్త బార్ పాలసీలో భాగంగా కల్లుగీత కార్మికులకు 10 శాతం కోటా కేటాయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న బార్ పాలసీని పూర్తి స్థాయిలో మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన బార్ పాలసీని అమలు చేయనున్న నేపథ్యంలో బార్ పాలసీ రూపకల్పనతో అధికారులు కసరత్తు చేస్తు్న్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని బార్లు ఏర్పాటు చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనలు సడలించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో కొత్త బార్లు ఏర్పాటును ప్రోత్సహించేలా నిబంధనలు సడలించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం ఉన్న బార్లను ఒకచోట నుంచి మరో చోటకు మార్చుకునే వెసలుబాటును కల్పించనున్నట్లు తెలిసింది.
ఈ నెల 31వ తేదీతో ప్రస్తుతం ఉన్న ఏపీ బార్ పాలసీ ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన బార్ పాలసీని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ఎక్సైజ్ పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బార్ పాలసీ రూపకల్పనలోనూ పనిచేస్తోంది. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. అలాగే స్టార్ హోటల్స్, మైక్రోబ్రూవరీలలో మరో 50 బార్లు పనిచేస్తున్నాయి. అలాగే ప్రస్తుత పాలసీ పీరియడ్‌లో 44 బార్లు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. వీటన్నింటిని మీద ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. తాజాగా కల్లుగీత కార్మికులకు బార్లలో పదిశాతం కోటా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో 840 బార్లలో 84 బార్లు ఆ సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మరికొన్ని కొత్త బార్లు ఏర్పాటు చేస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.