చేవెళ్లలోని సెరేన్ ఆర్చర్డ్స్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ ముసుగులో డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అభిజిత్ బెనర్జీ అనే ఐటీ ఎంప్లాయీ ఈ బర్త్‌డే పార్టీ ప్లాన్ చేశాడు. తనతో పాటు పనిచేసే సిప్సన్, పార్థ్ గోయల్, పల్లప్ప యశ్వంత్ రెడ్డి, సిల్వెస్టర్ సవియో రాస్, నవీన్ సహదేవ్, డెన్నిస్ జోసఫ్… ఇలా మొత్తం ఏడుగురిని పార్టీకి ఆహ్వానించాడు. ఇక అందరూ కలిసి డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేస్తుండగా… పక్కా సమాచారంతో మెరుపుదాడి చేశారు ఎక్సైజ్ పోలీసులు. మ్యూజిక్ అండ్ డ్రగ్స్ మ్యాజిక్‌తో వాళ్లు స్వర్గంలో విహరిస్తున్నప్పుడు ఎక్సైజ్ అధికారులు దాడి చేసి, వాళ్ల మత్తు దించి, భూమి మీదకు తీసుకొచ్చారు.
కీలక సూత్రధారి అభిజిత్ బెనర్జీ
డ్రగ్స్ పార్టీ జరుపుకున్న వారంతా ఒకే కంపెనీకి చెందిన ఐటీ ఉద్యోగులు అని పోలీసులు చెబుతున్నారు. బర్త్‌డే, ప్రమోషన్ సందర్భాలను పురస్కరించుకుని వాళ్లు ఈ పార్టీకి ప్లాన్ చేసుకున్నారు. ఈ పార్టీ ఆర్గనైజర్, డ్రగ్స్ యవ్వారంలో కీలక సూత్రధారి అభిజిత్ బెనర్జీపై కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఎక్సైజ్ పోలీసులు..డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు.
ఇక హిమాచల్‌ప్రదేశ్ నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అయ్యాయి. మొత్తం రూ. 2 లక్షల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. LSD-4, కానబీస్, హ్యాష్ ఆయిల్, చరస్ లాంటి మత్తు పదార్థాలను సీజ్ చేశారు. ఇక డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. రూ. 50 లక్షల విలువైన 3 కార్లు, 6 సెల్‌ఫోన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నగర శివార్లలో వేల ఫామ్‌హౌస్‌లు
హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల, శామీర్‌పేట, మొయినాబాద్, శంకర్పల్లి ప్రాంతాల్లో దాదాపు 3 వేల ఫామ్‌హౌసులు, వీకెండ్ గెస్ట్‌హౌసులు ఉన్నాయి. దీంతో డ్రగ్స్ పార్టీల కోసం ఇలాంటి నిర్మానుష్య ప్రాంతాలనే ఎంజాయ్ బ్యాచ్‌లు ఎంచుకుంటున్నాయి. ఇక నగరంలో యాంటీ నార్కోటిక్స్ టీమ్స్, ఈగల్ టీమ్స్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు…ఇలాంటివి బోలెడు ఉన్నాయి. అయినా శివార్లలో డ్రగ్స్ పార్టీలు ఆగడం లేదు. దీంతో ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలకు చెక్ పెట్టేందుకు, వాటిని అద్దెకు ఇచ్చే ఓనర్లను కూడా బాధ్యులను చేసి, వాళ్లపై కేసులు పెట్టే వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎక్సైజ్ వ్యూహంతో శివార్లలో డ్రగ్ పార్టీలకు చెక్ పడుతుందేమో చూడాలి.