ఒక దళితుడు తమ అమ్మాయిని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవడమే కాకుండా తమను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాడనే కోపంతో అమ్మాయి బంధువులు అంతా కలిసి మొత్తం దళితవాడ మీదే దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో చోటు చేసుకుంది. దాదాపు 40 మందికి పైగా తమ గ్రామం మీదకు వచ్చి ఇంటింటికి వెళ్లి ఆడవాళ్లను సైతం కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ ఊరికి చెందిన అబ్బాయి.. వాళ్లమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో మొత్తం ఊరిలో ఉన్నవాళ్లందరి మీద దాడి చేయడం ఎంత వరకు న్యాయమని మహిళలు ప్రశ్నిస్తున్నారు.బోగోలు మండలం తెల్లగుంట గ్రామంలోని దళిత సామాజికవర్గానికి చెందిన వంశీకృష్ణ.. సిద్దనపాలెం గ్రామంలో యాదవ సామాజికవర్గానికి చెందిన లక్ష్మీ ప్రసన్న ఇంటర్‌లో కలిసి చదువుకున్నారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, వీరి ప్రేమను లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. లక్ష్మీ ప్రసన్న.. వంశీకృష్ణను ప్రేమించడం ఊళ్లో యాదవ సామాజికవర్గానికి చెందిన ఎవ్వరికీ నచ్చలేదు. కానీ, లక్ష్మీ ప్రసన్న మాత్రం తాను వంశీకృష్ణనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. జూలై 30వ తేదీన బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మీ పసన్న మెడలో వంశీకృష్ణ మూడుముళ్లు వేశాడు. అనంతరం వీరిద్దరూ నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీసుకి వెళ్లారు. తాము మేజర్లమని.. కలిసి జీవిద్దామని నిర్ణయించుకున్నామని.. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కావాలని ఎస్పీ ఆఫీసులో లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదు చేసింది. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇరువైపుల నుంచి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ‘మీతో సంబంధం లేకుండా వారిద్దరూ బతుకుదామని నిర్ణయించుకున్నారు.. కాబట్టి ఇకపై వాళ్ల జోలికి వెళ్లడానికి వీళ్లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.అయితే, ఆగస్టు 2వ తేదీన మధ్యాహ్నం సమయంలో సిద్దనపాలెం గ్రామానికి చెందిన కొంతమంది తెల్లగుంట గ్రామానికి వెళ్లారు. తమ అమ్మాయిని అప్పగించాలంటూ వంశీకృష్ణ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. వాళ్లు ఇక్కడ లేరని చెప్పడంతో దాడి చేశారు. ఇంట్లో సామానులు చిందరవందర చేశారు. కొన్ని ఇళ్లలో మగవారు లేకపోవడంతో మహిళలు ఎదురుతిరిగారు. దీంతో ఎదురుతిరిగిన మహిళలను కొట్టారు. దాడి దృశ్యాలను ఓ మహిళ ఫోన్‌లో రికార్డ్ చేస్తుంటే ఆ ఫోన్ లాక్కొని పగలగొట్టారు.ఈ దాడిలో వంశీకృష్ణ సవతి తల్లి సరళ గాయపడ్డారు. అలాగే, బొందు సుశీల అనే మహిళ చేతికి కూడా గాయమైంది. ఇంకొంత మంది మహిళలను సైతం వాళ్లు కొట్టారని గ్రామస్థులు చెబుతున్నారు. దాదాపు 40 మందికి పైగా గ్రామంపై మూకుమ్మడి దాడి చేశారని చెబుతున్నారు. ఈ దాడిపై కప్పరాళ్లతిప్ప పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆగస్టు 4న కావలి రూరల్ సీఐ పాపారావు, కప్పరాళ్లతిప్ప ఎస్ఐ ఎన్.ప్రభాకర్ తమ సిబ్బందితో కలిసి తెల్లగుంట గ్రామాన్ని సందర్శించారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.