Andhra Pradesh Free NEET IIT Coaching: తల్లిదండ్రులు తమ పిల్లలను NEET, IIT శిక్షణ కోసం కార్పొరేట్ కాలేజీల్లో చేర్చాలని అనుకుంటున్నారు. కొందరు లక్షలు పెట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు. అయితే అందరి దగ్గర డబ్బులు ఉండవు. అందుకే పేద పిల్లల కోసం ప్రభుత్వం IIT, NEET కోచింగ్ ఇస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ప్రత్యేక తరగతులు మొదలు పెట్టింది.ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తరగతులు మొదలయ్యాయి.
హైలైట్:
- ఏపీలో విద్యార్థులకు తీపికబురు
- ఉచితంగా నీట్, ఐఐటీలో శిక్షణ
- గురుకులాల్లో ప్రత్యేక తరగతులు

ఈ మేరకు ప్రభుత్వం నీట్, ఐఐటీ కోచింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తోంది. ఇంటర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లతో శిక్షణ ఇస్తే సరిగ్గా ఫలితాలు రావట్లేదు. అందుకే ప్రత్యేకంగా బోధించేవాళ్లను తీసుకుంటున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న లెక్చరర్లను తీసుకుంటున్నారు. బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఇద్దరిని, మ్యాథ్స్ కు ఒకరిని తీసుకుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో నీట్, ఐఐటీ వంటి పరీక్షలకు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
పేద విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చదివే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ కాలేజీల్లో కార్పొరేట్ కళాశాలల స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. దీని ద్వారా నీట్, ఐఐటీ వంటి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించవచ్చు అంటున్నారు. పేద విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. పేద పిల్లలు ఈ శిక్షణ తీసుకుంటే చాలా ఖర్చు అవుతుందని.. అలాంటి వారికి ఉచితంగా శిక్షణ అందించడ మంచి నిర్ణయం అంటున్నారు.