
జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నమ్మించి నిండా ముంచాడు. ముద్ర రుణాలు ఇప్పిస్తానంటూ సుమారు 500 మంది మహిళలను మోసం చేశాడు. పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పేరు.. షేక్ జానీ.. మరో పేరు.. హరినాథ్ రావు.. ఊరు నల్గొండ జిల్లా నకిరేకల్. ఇంటర్ ఫెయిలైన జానీ.. బతుకు దెరువు కోసం 2011లో హైదరాబాద్‌కు మకారం మార్చాడు.. సరూర్‌నగర్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలం ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన జానీ.. కొవిడ్ సమయంలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత కొత్త దుకాణం తెరిచాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా ముద్ర రుణాల గురించి అవగాహన పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే పరిచయమైన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి బ్యాంకు రుణం ఇప్పిస్తానంటూ నకిలీ గుర్తింపు కార్డులతో నమ్మబలికాడు. అదే పేరుతో సిమ్ కొనుగోలు చేశాడు. ఉదయాన్నే బైక్‌పై వివిధ ప్రాంతాలు తిరిగేవాడు. టైలరింగ్, బ్యూటీపార్లర్ వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసే మధ్యతరగతి మహిళలను గమనించేవాడు. దుకాణాల బోర్డులపై ఉండే ఫోన్‌నంబర్లను సేకరించి, వారికి ఫోన్ చేసి, ముద్ర రుణాల ఏజెంట్ హరనాథ్ రావుగా పరిచయం చేసుకునేవాడు.
రూ.లక్షకు రూ.2 వేలు కమీషన్ ఇవ్వాలని షరతు విధించేవాడు. ఏటీఎం వద్దకు వెళ్లి, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారని, బంధువులు, స్నేహితుల నుంచి డబ్బు వస్తుందని చెప్పి.. వారి ఖాతాల్లో కమీషన్ సొమ్ము జమ చేయించేవాడు. ఇలా మాయమాటలతో ప్రతినెలా రూ.2-3 లక్షలు వసూలు చేశాడు. ఆ సొమ్ముతో నగర శివార్లలో రెండు ఫ్లాట్లు, ఒక విలాసవంతమైన కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్ కొనుగోలు చేశాడు. పిల్లలు కార్పొరేట్ విద్యాసంస్థలో చేర్పించాడు. ఒకరకంగా చెప్పాలంటే మంది సొమ్ముతో రాజభోగం అనుభవించాడు. అయితే, లోన్ రాని.. ఓ బాధితురాలి ఫిర్యాదుతో షేక్ జానీ బండారం బయటపడింది. చివరికి పక్కా సమాచారంతో సెంట్రల్ టాస్క్‌పోర్స్ బృందం దాడి షేక్ జానీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక కారు, ఒక బైక్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..