Nara Lokesh on AP July GST Collections: జూలై నెల జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ దుమ్మురేపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో ఏపీలో రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడి వచ్చింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. జీఎస్టీ వార్షిక వృద్ధి రేటులో దక్షిణ భారతదేశంలోనే తొలిస్థానంలో ఉన్నామని.. ఏపీ ఈజ్ బ్యాక్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు జీఎస్టీ రాబడి విషయానికి వస్తే.. గతంలో ఏ జులైలోనూ లేనంత జీఎస్టీ వసూళ్లను ఏపీ గత నెలలో సాధించింది. అలాగే 2018 నుంచి 2025 వరకూ.. జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రావటం ఇదే తొలిసారి. అలాగే నికర జీఎస్టీ వసూళ్లు కూడా రూ.2,930 కోట్లు సాధించడం కూడా ఓ రికార్డని అధికారులు చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యధికమని ఏపీ వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్ ఎ.కె.బాబు చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎదురైన ప్రతికూల ఫలితాలతో పోలిస్తే ఇది చాలా మంచి పరిణామమని.. అలాగే 14 శాతం వృద్ధితో ఎగువకు దూసుకువెళ్లామని ఆయన వివరించారు.
మరోవైపు 2024 జూలై నెలతో పోలిస్తే.. 2025 జూలై నెలలో దక్షిణాది రాష్ట్రాలలో జీఎస్టీ అత్యధిక వృద్ధి రేటు ఏపీనే నమోదు చేసింది. 2024 జూలై నెలలో ఏపీ రూ.3346 కోట్లు జీఎస్టీ వసూలు చేయగా.. 2025 జూలై నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.3.803 కోట్లకు చేరాయి. దీంతో వార్షిక వృద్ధి రేటు 14 శాతంగా నమోదైంది. అటు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే 2024 జూలై నెలలో రూ.4940 కోట్లు జీఎస్టీ వసూళ్లు సాధించగా.. 2025 జూలైలో రూ.5417 కోట్లు జీఎస్టీ రాబడి వచ్చింది. మొత్తంగా పది శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది.
తమిళనాడు రూ.10,490 కోట్లు నుంచి రూ.11,296 కోట్లకు పెరిగి 8 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. కర్ణాటక రాష్ట్రం విషయానికి వస్తే జీఎస్టీ వసూళ్లు 2024 జూలై నెలలో రూ.13,025 కోట్లుగా ఉంటే.. ఈ జూలై నెలలో మాత్రం రూ.13, 967 కోట్లకు చేరాయి. దీంతో కర్ణాటక 7 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ 18 శాతం, బిహార్ 16 శాతం తర్వాత జీఎస్టీ వార్షిక వృద్ధిరేటులో ఏపీ 14 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఏపీ ఈజ్ బ్యాక్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.