ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త వినిపించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ ఏడో తేదీ నుంచి చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే చేనేత వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే చేనేతల కోసం ఉద్దేశించిన థ్రిఫ్ట్ ఫండ్‌కు 5 కోట్లు కేటాయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

మరోవైపు చేనేత కార్మికుల ఇళ్లకు ప్రతి నెలా 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్ట్ 7 నుంచి మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనలో చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. మంగళవారం చేనేత శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. ఉచిత విద్యుత్ పథకంతో పాటుగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్రమే భరించాలని నిర్ణయించారు.
మరోవైపు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 50 వేలకు పైగా చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అలాగే 15 వేల వరకూ ఉన్న పవర్ లూమ్స్ యజమానులకు కూడా ఉపయోగం కలగనుంది. ఉచిత విద్యుత్ పథకం అమలుతో చేనేత మగ్గాలు ఉన్న కుటుంబాలకు నెలకు రూ.950 నుంచి రూ.1250 వరకూ.. అలాగే మర మగ్గాలు ఉన్న కుటుంబాలకు నెలకు రూ. 2500 వరకూ ప్రయోజనం చేకూరుతుంది. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం రూ.125 కోట్ల వరకూ ఖర్చు చేయనుంది.
మరోవైపు థ్రిఫ్ట్ ఫండ్ పథకం.. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించే పథకం. ఈ పథకం కింద చేనేత కార్మికులు తమ నెల ఆదాయంలో 8 శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం దీనికి అదనంగా మరో 16 శాతం మొత్తం చెల్లిస్తుంది. ఈ పొదుపు మొత్తం చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. మూడేళ్లు దాటిన తర్వాతచేనేత కార్మికులు కావాల్సిన మొత్తం విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.