ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇంటిపై పడేందుకు అవకాశం ఉన్న చెట్లను తొలగించుకోవాలని సూచించింది. అలాగే మెరుపు కనబడిన తర్వాత 30 అంకెలు లెక్కపెట్టాలని.. ఈ లోపు ఉరుము శబ్దం కూడా వినిపిస్తే వెంటనే ఇంట్లోకి లేదా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించింది. అలాగే ఉరుము శబ్దం వినపడిన తర్వాత అరగంటపాటు బయట పనులు చేయకపోవటం మంచిదని సూచించింది.
అలాగే ఎలక్ట్రికల్ పరికరాలకు నష్టం కలగకుండా ఎర్తింగ్ ప్రక్రియ సరిగా చూసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇల్లు, ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలను సురక్షితంగా ఉంచుకునేందుకు సర్జ్ ప్రొటెక్టర్స్, మెరుపు రాడ్లు వంటివి ఏర్పాటు చేసుకోవటం మంచిదని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటే ఇంట్లోని కరెంట్ పరికరాలను అన్ ప్లగ్ చేయాలని సూచించింది. ఎలక్ట్రికల్ పరికరాలు, ఛార్జర్లు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే ఉరుములు, మెరుపుల సమయంలో కిటికీలు, తలుపుల దగ్గరగా ఉండవద్దని.. దూరంగా ఉండాలని సూచించింది. ప్లంబింగ్, ఐరన్ పైపులను తాకవద్దని.. పారుతున్న నీటిని కూడా ఉపయోగించవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. చెట్ల కింద నిలబడకూదదని సూచించింది. కారు లేదా బస్సు లోపల ఉంటే డోర్లు మూసి ఉంచాలని సూచించింది. లోహపు వస్తువులను ఉపయోగించవద్దని.. విద్యుత్, టెలిఫోన్ వైర్ల నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేస్తోంది.