భారత ఎగుమతులపై అధిక సుంకాలు విధించాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య కీలకమైన సమయంలో అమెరికా-భారత్ సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. శత్రువు చైనాకు అనుమతి ఇవ్వవద్దని, భారతదేశం వంటి మిత్రదేశంతో సంబంధాలను తగలబెట్టవద్దని ఆమె సూచించారు.
రిపబ్లికన్ నాయకుడు ట్రంప్ పరిపాలన తీరుపై ఆమె తీవ్రంగా విమర్శించారు. చైనాతో వాణిజ్యాన్ని మృదువుగా నిర్వహించడాన్ని నిక్కీ హేలీ తప్పుబట్టారు. ఇందులో అమెరికా 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఒక పోస్ట్ చేశారు హేలీ. “చైనాకు అనుమతి ఇవ్వకండి.. భారతదేశం వంటి బలమైన మిత్రదేశంతో సంబంధాన్ని తెగ్గొట్టకండి” అని ఆమె అన్నారు.
India should not be buying oil from Russia. But China, an adversary and the number one buyer of Russian and Iranian oil, got a 90-day tariff pause. Don’t give China a pass and burn a relationship with a strong ally like India.
— Nikki Haley (@NikkiHaley) August 5, 2025
అమెరికా, భారతదేశం మధ్య బలమైన సంబంధాలకు చాలా కాలంగా మద్దతు ఇస్తున్న హేలీ, ఇండో-పసిఫిక్‌లోని ప్రజాస్వామ్య దేశాలతో, ముఖ్యంగా భారతదేశంతో సన్నిహిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా చైనా ప్రపంచ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని హేలీ గుర్తు చేశారు.
ఆగస్టు 1 నుండి ఇప్పటికే 25 శాతంగా ఉన్న భారత వస్తువులపై 24 గంటల్లోపు సుంకాలను భారీగా పెంచే ప్రణాళికలను ట్రంప్ ప్రకటించారు. ఇటీవల ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం రష్యన్ చమురు కొనుగోలును కొనసాగించడంతో ముడిపెట్టి, భారత్‌తో యుద్ధ యంత్రానికి ఇంధనం నింపుతోంది అని పేర్కొన్నారు. “భారతదేశంలో ఏ దేశంలోనూ లేనంత అత్యధిక సుంకాలు ఉన్నాయి” అని ట్రంప్ ఇంటర్వ్యూలో అన్నారు. “మాతో చాలా వ్యాపారం చేస్తారు. మేము వారితో పెద్దగా చేయము. 25 శాతం సుంకాలకు అంగీకరించాము, కానీ వారి రష్యన్ చమురు వ్యాపారం కారణంగా ఇప్పుడు భారత్‌పై గణనీయంగా పెంచబోతున్నాను” అని ట్రంప్ భారతదేశం కోసం పానిక్ బటన్‌ను నొక్కాలని కోరుతూ అన్నారు.
కొత్త ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకి తగ్గించడానికి భారతదేశం ప్రతిపాదించిందని ట్రంప్ అంగీకరించారు. కానీ ఆ ప్రతిపాదన సరిపోదని తోసిపుచ్చారు. తాము వ్యతిరేకించే యుద్ధానికి నిధులు సమకూర్చడంలో జీరో సుంకాలు సరిపోవు అని ఆయన అన్నారు.
మరోవైపు భారతదేశం తన ఇంధన విధానాన్ని స్థిరంగా సమర్థించుకుంది. దాని చమురు దిగుమతులు జాతీయ ఆసక్తి, స్థోమతపై ఆధారపడి ఉన్నాయని వాదించింది. అమెరికా తన అవసరాల కోసం రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నప్పుడు, భారత్ కూడా తన శక్తి అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనడం తప్పేమీ కాదని భారత ప్రభుత్వం బలంగా వాదిస్తోంది. తనకు అవసరం అయితే ఆంక్షల సడలింపు.. లేకపోతే టారిఫ్‌లు, సెస్సులు. ఇంత డబుల్‌స్టాండర్డ్స్ పాటిస్తూ.. ప్రపంచానికి నీతిపాఠాలు చెబుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, హేలీ వ్యాఖ్యలకు.. రష్యా నుండి చమురు దిగుమతులను సమర్థిస్తూ భారతదేశం ఇటీవల చేసిన ప్రకటనలకు వైట్ హౌస్ అధికారికంగా స్పందించలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..